ఫ్యాక్షన్ నేత మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భానుకిరణ్ (భాను)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తన కుటుంబ సభ్యులతో సాగించిన టెలిఫోన్ సంభాషణలు, ఎస్ఎంఎస్‌ల ఆధారంగా భానును బెంగుళూరులో శనివారం అరెస్టు చేశారు.
ఇటీవల ఫ్యాక్షన్ నేత సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి తాను ప్రయాణిస్తున్న కారులోనే హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యను కారు వెనుక సీట్లో కూర్చొన్న భానుకిరణ్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్న తరణంలో హత్య అనంతరం భాను కనిపించకుండా పారిపోయాడు.
భానుకోసం తీవ్రంగా గాలిస్తూ వచ్చిన హైదరాబాద్ పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా బెంగుళూరులో ఉన్నట్టు గుర్తించారు. మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు భానును చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదిలావుండగా భాను, తల్లి, అక్క, బావలను కూడా విచారిస్తున్నట్టు వినికిడి.