తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ జిల్లా కేంద్రంగానే తెదేపా నిర్వహించిన రైతుకోసం బహిరంగ సభ విజయవంతమైంది. ఆ మరుసటిరోజే ఆ పార్టీకి జిల్లాలో కీలక నేతగా ఉన్న సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్య గుడ్‌బై చెప్పారు.
కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న యువనేత, కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు ప్రకటించారు. తనతో పాటు.. జిల్లాలోని పలువురు కీలక నేతలు కూడా జగన్‌తో కలిసి నడుస్తారని చెప్పారు.
పెదరత్తయ్య తన అనుచరులతో శుక్రవారం ఉదయం జగన్‌ను కలిసి తన మద్దతు తెలిపారు. ఈయన విజయవాడలో జగన్ నిర్వహించిన లక్ష్యదీక్షలో కూడా పాల్గొని తన సంఘీభావాన్ని ప్రకటించారు పెద్దరత్తయ్య నిష్క్రమణతో జిల్లా రాజకీయ రూపురేఖలు మారే అవకాశాలు ఉన్నాయి.