తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో దాడులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్ళంరాజు అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులపై కేసుల ఎత్తివేతపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏదిఏమైనా.. విద్యార్థులపై ఈ కేసులు ఎత్తివేయడం సరైన నిర్ణయం కాదన్నారు. మన్ముందు ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని ఆయన సూచించారు.
ఇకపోతే.. కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తన మనస్సుకు మేకప్ వేసుకుంటున్నారన్నారు. ఆయన జగన్ వెంట వెళ్లాలా వద్దా అనే అంశంపై మల్లుగుల్లాలు పడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అండతోనే దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉన్నతస్థానానికి ఎదిగారన్నారు.
ఈ విషయాన్ని ఏ ఒక్కరూ విస్మరించజాలరన్నారు. ఇకపోతే అనేక మంది కాంగ్రెస్ నేతలు జగన్ వైపుకు వెళ్లాలా లేదా అనే అంశంపై సందిగ్ధతలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఎందుకంటే.. మరో మూడేళ్ళ పాటు అధికారాన్ని దూరం చేసుకోలేక, మరోవైపు జగన్ శిబిరం వైపు అడుగులు వేయలేక సతమతమవుతున్నారన్నారు. ఇలాంటి వారిలో ద్వారంపూడి కూడా ఒకరని పళ్లంరాజు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ద్వారంపూడి కూడా పాల్గొనడం గమనార్హం.