ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం దురదృష్టకరమని సీమాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) పేర్కొంది. తెలంగాణలో అయినా, సీమాంధ్రలో అయినా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినా ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందనే అపోహలో వారు ఉండిపోతారని ఐకాస వెల్లడించింది. అయితే చిన్న చిన్న తప్పులు చేసిన వారిపై కేసులు ఎత్తివేయవచ్చునని ఐకాస తెలిపింది.
విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ దృష్టికి తీసుకెళతామని ఐకాస చెప్పింది. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వస్తే సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేయాలని ఐకాస డిమాండ్ చేసింది. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు అంతా సమైక్యాంధ్రకోసం రాజీనామాకు సిద్ధపడాలంది. లేదంటే వారిని సమైక్యాంధ్ర ద్రోహులుగా ప్రకటిస్తామన్నారు.