పార్లమెంట్ సభ్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మ్యాచ్ ఫిక్సింగ్ అని విపక్షాలు చేసే విమర్శలను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి కొట్టి పారేశారు.
రైతు సమస్యలు, విద్యార్థుల కేసుల ఎత్తివేత కోసం శాసనసభలో ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేసినప్పడు పట్టించుకోని ప్రభుత్వం, తమ పార్టీ ఎంపీలు రోడ్డుకెక్కేసరికి ప్రభుత్వం దిగివచ్చినట్లు హైడ్రామా చేసిందని ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో ఎలాంటి నిజం లేదని దామోదర్ రెడ్డి అన్నారు.
విద్యార్థులపై కేసుల ఎత్తివేత కోసం తమ పార్టీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు చేపట్టిన దీక్ష మ్యాచ్ ఫిక్సింగ్ కాదని ఆయన స్పష్టం చేశారు. తమకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, తమ బాధ్యతగా నిరాహార దీక్ష చేపట్టామని దామోదర్ రెడ్డి అన్నారు.
దీక్షలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులను పరామర్శించడానికి వందలాది మంది ప్రజా సంఘాల నాయకులు వచ్చారని, కెసిఆర్, గద్దర్ వచ్చారని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.