జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వేదాంతధోరణిలో సమాధానం ఇచ్చారు. తాను ఒక ఆశావాదిని. అందువల్ల మనమంతా సమైక్యంగా ఉంటామని భావిస్తున్నామని చెప్పారు. మీడియా వేసే ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమని ఆయన అన్నారు.
ఆయన బుధవారం గుంటూరు జిల్లా నర్సాపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఖచ్చితంగా రాష్ట్రం సమైక్యాంగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు సమైక్యంగా ఉందామనే కోరుకుంటున్నారని, అందువల్ల జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ కూడా మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఇస్తుందనే ఆశిస్తున్నట్టు చెప్పారు.
తినబోయే ముందు రుచి చూడటం భావ్యం కాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా కమిటీ నివేదిక ఇస్తే అపుడు తమ స్పందన వెల్లడిస్తామన్నారు. ముందుగా ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేమన్నారు. తాను కరుడుగట్టిన సమైక్యాఖ్యవాదిగానే చివరి ఉంటానని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని చిరంజీవి స్పష్టం చేశారు.