దేశానికి అన్నం పెడుతున్న రైతన్న కన్నీరు పెడితే రాష్ట్రానికే అరిష్టమని కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడలో తలపెట్టిన సామూహిక దీక్ష యధావిథిగా కొనసాగుతుందని జగన్ ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన గురువారం రాత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రైతు సమస్యలపై తాను చేసిన ఆచరణ సాధ్యమైన డిమాండ్లలో ప్రభుత్వం కొన్నింటినే పరిష్కరించిందన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన పంటనష్ట ప్యాకేజీ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. బాధిత అన్నదాతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఔదార్యాన్ని కనబర్చనందుకు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
ఇందులోభాగంగా ఈ నెల 21, 22వ తేదీల్లో లక్షలాది మంది రైతులు, నేతన్నలతో కలిసి సాముహిక దీక్షను యధావిథిగా కొనసాగించనున్నట్టు ప్రకటించారు. రైతులను ఆదుకునే విషయంలో దివంగత ప్రజానేత వైఎస్సార్ అనుసరించిన మార్గాలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శనీయమన్నారు. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమని ఆయన చెపుతుండేవారని జగన్ గుర్తు చేశారు. అందువల్ల రైతుల కష్టాలు తీర్చి, వారిని ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.