తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. రాష్ట్రంలోని రైతు సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఆయన నిరాహారదీక్షకు దిగిన విషయం తెల్సిందే. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి దీక్షను ఆరంభించారు.
దీక్షకు మద్దతుగా చంద్రబాబుతో సహా రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, సీనియర్ నేత దేవేందర్‌గౌడ్, నాగం జనార్థన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉమామాధవరెడ్డి, మహిళా ఎమ్మెల్యేలు తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
ఇదిలావుండగా, చంద్రబాబు దీక్షకు దిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి భద్రతపై సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావు, హైదరాబాద్ కమిషనర్ ఏకే.ఖాన్‌లు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.