కాంగ్రెస్ పార్టీ భవిష్యత్‌కు పెను సవాల్‌గా మారిన మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఉప ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా కడపలో భేటీ అయ్యారు. సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వివేకానంద రెడ్డి, వైద్య ఆరోగ్య మంత్రి డీఎల్.రవీంధ్రా రెడ్డి, మైనారిటీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లాలతో పాటు.. కమలాపురం ఎమ్మెల్యే వీర శివారెడ్డి, ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలను కూడా ఆహ్వానించారు. ఈ స్థానాల్లో ఐదింటిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఏం చేయాలన్న దానిపై వీరు చర్చించారు.
అయితే, జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జగన్‌కు గట్టి మద్దతుదారుడు కాగా, ప్రొద్దుటూరు స్థానం తెదేపా ఖాతాలో ఉంది. ప్రొద్దుటూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఎటువెళతారన్నది ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
ఆ సమయంలో ఈ రెండు స్థానాల వ్యవహారం తనకు వదలేస్తే తాను చూసుకుంటానని చెప్పారు. ఏదిఏమైనా వరదరాజులు రెడ్డి మనతోనే ఉంటాడని వివేకా విశ్వాసం వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టే విషయంపై వారు చర్చించారు.
ఇదే అంశంపై ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చిస్తానని వివేకా ఈ సందర్భంగా చెప్పినట్టు వినికిడి. ఏఐసీసీసీ ప్లీనరీ సమావేశాలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కృషి చేస్తానని వివేకా హామీ ఇచ్చారు.
ఏది ఏమైనా.. వైఎస్ తనయుడు జగన్‌ను ఓడించేందుకు నిన్నటి వరకు బద్ధశత్రువులుగా ఉన్న వైఎస్.వివేకానంద రెడ్డి, డీఎల్.రవీంధ్రా రెడ్డి చేతులు కలపడాన్ని కడప జిల్లాలోని వైఎస్ఆర్ అభిమానులు, వివేకా మద్దతుదారుల్లో కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నట్టు సమాచారం.