రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులు ఏమాత్రం ఫలించవని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కె.తారక రామారావు జోస్యం చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలోని రైతులు ఆయనను విశ్వసించరన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అంటూ రైతుల పట్ల చిన్న చూపు చూశారన్నారు. ఆ ప్రభావం చంద్రబాబును పట్టిపీడిస్తుందన్నారు. అందువల్ల రైతు సమస్యలపై బాబు ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా రైతులు నమ్మ స్థితిలో లేరన్నారు.
ఉద్యమాలు చేసిన విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద అవలంభిస్తోందన్నారు. ముఖ్యంగా, నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు వారి వైఖరి ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పడవ నడి సముద్రంలో పయనిస్తోందని, ఇది ఎపుడు మునిగిపోతుందో ఎవ్వరూ చెప్పలేని దయనీయ స్థితిలో ఉందన్నారు. ఇకపోతే.. మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టిన తర్వాత తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కేటీఆర్ తెలిపారు.