రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోవడం ఖాయమని అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు.
కిరణ్ మంత్రివర్గంలో చోటు దక్కని పెద్దిరెడ్డి... గురువారం ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావన్నారు. అదేసమయంలో ఈ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. వచ్చే మార్చి 31వ తేదీ తర్వాత కొత్త ముఖ్యమంత్రి వస్తారన్నారు.
ఇకపోతే.. మంత్రిపదవి దక్కనందుకు పార్టీని వీడి ప్రసక్తే లేదన్నారు. సొంత పార్టీలోనే ఉంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పోరాటం చేస్తామన్నారు. కిరణ్ నాయకత్వంలో తమ మద్దతుదారులకు, అనుచరులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు.
పైపెచ్చు.. కిరణ్ కుమార్ రెడ్డితో ఆది నుంచి తమకు పడదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాను మంత్రిపదవి వద్దన్నారు. ఎందుకంటే ఆయనకు వెళ్లి ప్రిత రోజూ సెల్యూట్ చేయడానికి తన మనస్సు అంగీకరించదన్నారు.