Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రివర్గం కూర్పుపై కసరత్తు: నేతల్లో వీడని ఉత్కంఠ!!

మంత్రివర్గం కూర్పుపై కసరత్తు: నేతల్లో వీడని ఉత్కంఠ!!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గం జట్టును ఎంపిక చేయడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తనకంటే వయస్సు పైబడిన వారిని పక్కన పెట్టే పనిలో ఆయన అధిష్టానం వద్ద చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. కొత్త మంత్రివర్గంలో తనకంటే తక్కువ వయస్సున్న వారికి అంటే యువకులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి మాత్రమే చోటు దక్కేలా ఆయన కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులోభాగంగానే ఆయన గత రెండు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్ పెద్దలతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. అదేసమయంలో రాష్ట్ర మంత్రివర్గం కూర్పు సమాచారం లీక్ కాకుండా కేకేఆర్ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. జాబితా'తో శనివారం రాత్రికే తిరిగి వస్తారనుకున్నప్పటికీ... ఆయన మంగళవారం రాత్రికి గాని హైదరాబాద్‌కు వచ్చే సూచనలు కనిపించడం లేదు.

శనివారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన కిరణ్... మంత్రివర్గం కూర్పుపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ, కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, ప్రణబ్ ముఖర్జీ, ఆజాద్, చిదంబరం, ఏకే.ఆంటోనీలతో చర్చలు జరుపుతున్నారు.

మంత్రివర్గం కూర్పుతో పాటు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నియామకాలపైనా అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన చర్చిస్తున్నారు. మంత్రివర్గంలో స్థానానికి గట్టి పోటీ నెలకొనివుంది. దీంతో వడపోత కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సమర్థతతో పాటు.. క్లీన్ ఇమేజ్, విధేయతకే పెద్దపీట వేయనున్నారు.

ఇదిలావుండగా, మంత్రి పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మంత్రులు ఢిల్లీలో మకాం వేసి తమకున్న మార్గాల ద్వారా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. జాబితాలో తమ పేరు ఉండాలని కోరుతున్న నేతల వైపు కిరణ్ చిరునవ్వుతో చూస్తున్నారే గానీ వారికి స్పష్టమైన హామీ లభించడం లేదు. దీంతో నేతల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మొత్తం మీద కొత్త మంత్రివర్గం కూర్పుపై అధిష్టానం తీవ్రస్థాయిలో మల్లగుల్లాలు పడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu