తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాంరెడ్డి సోదరులకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం కొత్తగా ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో చోటు కల్పించకూడని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్టు తెలుస్తోంది.
2004లో వైఎస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి మంత్రిపదవి ఇచ్చారు. 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్.. దామోదర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో దామోదర్ రెడ్డికి వైఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేసమయంలో వైఎస్ హఠాన్మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఇందులో దామోదర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. మంత్రివర్గంలో స్థానం ఉండటంతో వెంకటరెడ్డి మాత్రం అడపాదడపా కనిపించే వారు. ముఖ్యంగా, దామోదర్ రెడ్డి మాత్రం అత్యంత కీలక పాత్ర పోషించారు.
ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం వీరికి చెక్ పెట్టేందుకు భావిస్తోంది. కాంగ్రెస్ నేతలెవ్వరూ భవిష్యత్‌లో ప్రాంతీయ ఉద్యమాల్లో పాల్గొనకుండా కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచి వ్యూహరచన చేస్తోంది. ఇందులోభాగంగా పలువురు సీనయర్లకు చెక్ పెట్టి యువకులకు చోటు కల్పించాలనే యోచనలో ఉంది.