ఎస్సై రాత పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి ప్రకటించడాన్ని సీమాంధ్రకు చెందిన విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలను మొదలుపెట్టింది.
విశాపట్టణం సిరిపురం కూడలిలో ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు దుకాణాలను మూసివేయిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్శిటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించనున్నట్లు ఏయూ ఐకాస తెలిపింది.
ఎన్నో రోజులుగా కళ్లు కాయలు కాచేటట్లు ఎదురు చూస్తున్న అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందనీ, ఎవరో కొద్దిమంది చేస్తున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పరీక్ష వాయిదా వేయడంపై విద్యార్థులు ధ్వజమెత్తుతున్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుక కూచున్నారు. మరోవైపు అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.