Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ న్యాయవాదులది ఆటవిక చర్య: ఆనం వివేకా

తెలంగాణ న్యాయవాదులది ఆటవిక చర్య: ఆనం వివేకా
న్యాయవ్యవస్థకు సంబంధించిన పదవుల్లో తెలంగాణవారికి 42 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ న్యాయవాదులది ఆటవిక చర్య అని కాంగ్రెస్ సీమాంధ్ర శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. వాటా పేరిట తెలంగాణ న్యాయవాదులు న్యాయదేవత కొంగు పట్టుకుని లాగుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కేసీఆరే ఓ సెటిలర్ అని ఆనం వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి అమెరికా పౌరసత్వం కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు.

న్యాయవ్యవస్థలో ప్రాంతాలవారీ వాటాపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆనం తెలిపారు. ఇంకా తెలంగాణ న్యాయవాదులకు అన్యాయం జరిగిందని భావిస్తే వారు హైకోర్టును ఆశ్రయించవచ్చునని ఆయన అన్నారు.

తెలంగాణ న్యాయవాదులపై కాంగ్రెస్ సీమాంధ్ర శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డితో పాటు శైలజానాథ్ కూడా విమర్శల వర్షం కురిపించారు. అసలు హక్కుదారులం ఊరుకుంటే అందరూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని శైలజానాధ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో రాయలసీమ వారే నష్టపోయారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ న్యాయవాదులు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సానుకూల ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హెచ్చరించారు. న్యాయవాదుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దని కేసీఆర్ కోరారు.

ప్రస్తుతానికి తెలంగాణ న్యాయవాదుల పోరాటం ఆగేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ న్యాయవాదుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. న్యాయశాఖలో తెలంగాణకు 42 శాతం వాటా ఇవాల్సిందేనన్నారు.

మరోవైపు తెలంగాణ న్యాయవాదుల పోరాటానికి ప్రతిపక్ష నాయకుడు, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారు. ఇంకా ఈ పోరాటానికి తెరాస, జేఏసీలు సైతం సంఘీభావం తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu