తమిళనాడు మాజీ అన్నాడీఎంకే నేత, జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్య పరిస్థితి నానాటికి విషమంగా మారుతోంది. ఆమె శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు మొదట బెంగళూరులోని లేడీ క్యూర్‌జోన్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.
కరోనా లక్షణాలు కనిపించడంతో రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ కోవిడ్ నిర్ధారణ కోసం మళ్ళీ సీటీ స్కాన్ పరీక్షను నిర్వహించగా కరోనా బారిన పడ్డారని నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఆమె సత్వరం కోలుకోవాలని, క్షేమంగా తిరిగి రావాలంటూ 'అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం' (ఏఎంఎంకే) కార్యకర్తలతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా పలు చోట్ల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.