కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు దేశంలోని విమానాశ్రయాల్లో కల్పిస్తూ వచ్చిన ప్రత్యేక హోదాను తొలగించారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు.
గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాబర్ట్ వాద్రాకు ఎలాంటి చెకింగ్ లేకుండా ఎయిర్ పోర్ట్‌లోకి వెళ్లే అనుమతి ఉండేది. ఈ వసతిని గోవా విమానాశ్రయ అధికారులు తొలగించారు. యూపీఏ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ పరంగా అందే అన్ని రకాల ప్రత్యేక సేవలు పొందిన ఆయనకు ఇకపై ఆ హోదా కల్పించబోమంటూ ఎయిర్ పోర్టులోనే నోటీసు అంటించారు.
అర్హత లేని వ్యక్తులకు ప్రత్యేక సేవల్ని ఆపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల పౌర విమానయాన శాఖకు ఆదేశాలు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక సేవలకు అర్హులైన వ్యక్తుల జాబితాలోని వాద్రా పేరును అధికారులు ప్లాస్టర్‌తో మూసివేశారు. ఇకపై ఆయన ఎయిర్ పోర్ట్ కు వెళితే సాధారణ ప్రయాణికుల మాదిరి పోలీసుల సోదాలకు సహకరించాల్సిందే.