కరోనా రోగుల వైద్య సేవల నిమిత్తం రాష్ట్ర ప్రజలు విరాళాలు ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా స్పందిస్తోంది.
కొవిడ్ కట్టడి కోసం సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. కరోనా సహాయకచర్యలకు ఉపయోగించాలని కోరారు.
తాజాగా, ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్‌లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.
అంతకుముందు, రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్‌ముడి రూ.1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది.
అంతేకాకుండా, సన్ టీవీ యాజమాన్యం కూడా సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్ల వరకు విరాళాలు అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆ సంస్థ ఎండీ కళానిధి మారన్ దంపతులు కలిసి అందజేశారు.