Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఆత్మీయులు... మీ స్నేహితులు... వారికి మీ పూలు చెప్పే శుభాకాంక్షలు

మీ ఆత్మీయులు... మీ స్నేహితులు... వారికి మీ పూలు చెప్పే శుభాకాంక్షలు

Venkateswara Rao. I

, బుధవారం, 20 మార్చి 2013 (15:17 IST)
WD

సాధారణంగా మనం పూలచెట్లను అందం, పరిమళం కోసం పెంచుతుంటాం. ఇంటి ముందు ఎక్కువ స్థలం వున్నవారు ఓ చిన్న మోస్తారు పూదోటని పెంచితే, ప్లాట్స్‌లో నివసించేవారు తమకు లభ్యమయ్యే ప్రదేశంలో పూలకుండీలు పెట్టి పుష్పాలను పూయిస్తారు.

రకరకాల రంగులతో పుష్పించే ఆ పుష్పాలలో కొన్నింటిని జడలో తురుముకుని మురిసిపోయే స్త్రీలు, మిగిలిన పూలను ఇదివరకటిలా అలానే వదిలేయకుండా తమ ఇంట్లో అలంకరించి, ఇంటికి కొత్త అందాలను చేకూర్చే ప్రయత్నాలు చేస్తుంటారు.

కన్నులకింపైన పుష్పాలను పుష్పించే మొక్కలను ఎంచుకుని పెంచడం ఒక కళయితే అలా పుష్పించిన పుష్పాలను ఫ్లవర్‌వేజ్‌లో చూపరులను ఆకట్టుకునేట్లు అలంకరించడం ఓ కళ! రకరకాల పూలతో ఇంటిని ఎలా శోభాయమానంగా తీర్చిదిద్దుకోవచ్చో చూద్దాం.

పూలల్లో ఎన్నో రకాలు

పూలతో ఇంటిని అలంకరించుకోవాలనుకునే ముందు, మొదటిగా పుష్పించే మొక్కలను గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. పుష్పించే మొక్కలను గమనించినప్పుడు కొన్ని ఓ ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే పుష్పిస్తే, మరికొన్ని సంవత్సరానికి రెండుసార్లు, ఇంకొన్ని సంవత్సరం పొడవునా పుష్పిస్తూనే వుంటాయి.

అదేవిధంగా పరిసర వాతావారణం, నేల స్వభావాన్ని బట్టి పుష్పించే మొక్కల పెరుగుదల వుంటుంది. కాబట్టి తమ ప్రాంతంలో లభ్యమయ్యే మొక్కలను ఎంచుకుని పెంచడం సులువుగా ఉంటుంది. పూల కోసం మొక్కలను పెంచేముందు అవి పుష్పించే సీజన్లని దృష్టిలో పెట్టుకోవాలి. అలా సీజన్లని దృష్టిలో పెట్టుకుని మొక్కలను పెంచడం వల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశమేర్పడుతుంది.

ఉదాహరణకు ఎండా కాలంలో పుష్పించే మల్లె, సన్నజాజి, చామంతి, రోజా, సంపెంగ, ఎర్రగన్నేరు, బిగోనియా, డాలియా... వానాకాలంలో పుష్పించే టైగర్ లిల్లీ, వెరోనికా, యుక్కా... చలికాలంలో పుష్పించే బంతి, డిసెంబర్ పూలు, నందివర్ధనం, బోగన్ విల్లియా, కాక్టస్, హై బిస్కస్, బఠానీ పూలు, మార్ష్‌బంతి, రోజ్‌మేరీలను పెంచడంవల్ల సంవత్సరం పొడవునా పుష్పాలు లభ్యమయ్యే అవకాశం వుంది. ఇంకా సంవత్సరమంతా పుష్పించే మొక్కలు లేకపోలేదు.

webdunia
WD

కుండీలలో మొక్కలు పెంచుతున్నారా...
పుష్పించే మొక్కలను పెంచేటప్పుడు అవి పుష్పించే పుష్పాల రంగుని కూడా దృష్టిలో వుంచుకోవాలి. కొంతమందికి ముదురురంగులు నచ్చితే మరికొంతమందికి లేతరంగులు నచ్చుతాయి. అయితే పూలకుండీలలో మొక్కలను పెంచేవారు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను పాటించాల్సి వుంటుంది. పూలకుండీలలో పెంచే మొక్కలపై రోజుకి సుమారు ఆరుగంటల పాటు సూర్యరశ్మి సోకేటట్లు చూసుకోవాలి.

ప్రస్తుతం చాలామంది ప్లాస్టిక్ పూలకుండీలను, ఆయిల్‌ డబ్బాలను పెద్ద పెద్ద బాటిల్స్‌ని మొక్కలను పెంచేందుకు ఉపయోగిస్తున్నారు. ఇలా చిన్న చిన్న డబ్బాలలో మొక్కలను పెంచడంవల్ల ప్రతిరోజూ పూలను తెంపి ప్రత్యేకంగా ఫ్లవర్‌వేజ్‌లలో డెకరేట్ చేయాల్సిన అవసరం తప్పుతుంది. కావాల్సినంత తీరికవున్నా ఓపికలేని వారు ఈ పద్ధతిని ఉపయోగించాలి. ఇంటికి వచ్చే అతిథులు, బంధుమిత్రుల పొగడ్తలను పొందవచ్చు.

పుష్పాలతో అలంకరణకు ముందు
పూలను అలంకరించడానికి అందమైన ఫ్లవర్‌వేజ్‌లను ఎన్నిక చేసుకోవడం ముఖ్యం. మార్కెట్లో ఇత్తడి, పింగాణీ, స్టీల్, గ్లాస్, మట్టితో తయారుచేయబడిన ఫ్లవర్ వేజ్‌లు రకరకాల ఆకృతుల్లో, ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తున్నాయి. కొంతమంది వెరైటీ ప్రియులు చిన్న చిన్న బుట్టలకు, కూల్‌డ్రింక్ సీసాలకు, పౌడర్ డబ్బాలకు రంగులేసి వేజ్‌గా ఉపయోగిస్తుంటారు.

వేజ్‌లో అలంకరించేందుకై పూలను సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయానికి తర్వాత తుంచడం శ్రేయస్కరం. సూర్యోదయానికి ముందు తుంచడంవల్ల పూలల్లో వున్ననీటిశాతం ఆవిరవ్వదు. సూర్యాస్తమయం తర్వాత తుంచడంవల్ల పూలల్లో అధికంగావుండే చక్కెర శాతం వ్యర్థమవకుండా పూలు ఫ్రేష్‌గా వుండేందుకు ఎంతగానో దోహదపడుతుంది. పూలను చెట్టు నుంచి కోసేటప్పుడు సరిగ్గా కాండానికి అడ్డంగా కోయాలి. కాండానికి ఏటవాలుగా కోయకూడదు. పొడవు కాండాలున్న పూలను పొడవు కాండాలతోనే కోయడం మంచిది.

webdunia
WD

బొకేల ప్రెజెంటేషన్ చేసేటపుడు

ప్రస్తుతం ఏ శుభకార్యానికైనా ఫ్లవర్ బొకేని ప్రెజెంట్‌ చేసి పూలతో శుభాకాంక్షలు చెప్పడం ఫ్యాషనైంది. అయితే ఒక్కో రకమైన బొకే ఒక్కోవార్తని తెలియజేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ఏయే సందర్భాలకు ఎలాంటి బొకేలను ప్రెజెంట్ చేయాలనేది గమనిద్దాం.

ప్రేమని తెలియజేసేందుకు ఎరుపు రోజా పువ్వు. ఆస్పత్రిపాలైన వ్యక్తులు శీఘ్రంగా కోలుకోవాలని చెప్పేందుకు పసుపు రోజా. పెళ్ళిరోజున ఎరుపు రోజాలు. ఇరవై ఐదవ సంవత్సరపు పెళ్ళిరోజు అయితే తెలుపు రోజా బహుకరించాలి. లేకపోతే తెలుపు రిబ్బన్‌తో కట్టబడిన ఎరుపు రోజాలను కూడా ఇవ్వవచ్చు. ఏభయ్యవ సంవత్సరపు పెళ్లిరోజుకి పసుపు రోజాలు. బంగారు రంగు రిబ్బన్‌తో కట్టబడిన బొకే ఇవ్వాలి. ఆడపిల్ల పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు పింక్ రంగు పూలు, లేక పింక్ రిబ్బన్‌తో కట్టబడిన బొకే.

మగపిల్లాడు పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు నీలంరంగు పూలు లేక పలు రంగుల సమ్మిళితమైన పుష్పగుచ్ఛం. అయితే నీలంరంగు రిబ్బన్ తప్పనిసరి. పెళ్లి సందర్భంలో శుభాకాంక్షలు చెప్పేందుకు పలురంగులు కలగలిపిన పూలబొకే. ఎరుపురంగు పూలు బొకేలో అధికంగా వుండాలి.

గృహప్రవేశం, వ్యాపారసంస్థల ప్రారంభోత్సవాలకి ఉత్సాహం కలిగించే రీతిలో అన్నిరంగుల పుష్పాలు కలగలపిన పుష్పగుచ్ఛం. మదర్స్‌డే గ్రీటింగ్స్‌ని చెప్పేందుకు పలు వన్నెలతో కూడిన పుష్పగుచ్ఛం. విదేశాలలో నివశిస్తున్న మిత్రులకు మనదేశం నుంచి పుష్పగుచ్ఛాలను అందించేందుకు ఇక్కడున్న ఫ్లోరిస్ట్‌లు ఇంటర్‌ఫ్లోరా అనబడే అంతర్జాతీయ ఫ్లోరిస్ట్ సంఘంలో చేరుతున్నారు. ఇక్కడున్న ఫ్లోరిస్ట్ మన మిత్రుని అడ్రస్ తీసుకుని ఆ దేశంలో ఇంటర్ ఫ్లోరా సభ్యుడైన మరో ఫ్లోరిస్ట్‌కి మన మిత్రుని అడ్రస్ ఇచ్చి మన తరుపున పుష్పగుచ్ఛాన్ని అందజేయడం జరుగుతుంది.

సాధారణంగా శుభసందర్భాలకు - అందుకు తగినట్లుగా రకరకాల బొకేలను ప్రెజెంట్ చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లే, ఎవరైనా చనిపోయినపుడు వలయాకారంలో వుండే పుష్పగుచ్ఛాలను స్వర్గస్తులైన వారి గౌరవార్థం వారి పాదాలచెంత వుంచడం ఓ సాంప్రదాయంగా అనుసరించబడుతోంది.

మనింటికి ఎవరైనా విదేశీయులు డిన్నర్‌కి లేక టీ పార్టీకి వస్తే, మరుసటి రోజే థాంక్యూ కార్డుతో ఫ్లవర్ బొకేని సదరు విదేశీయుల నుంచి తప్పనిసరిగా మనం అందుకుంటామన్నమాట. ఇలా మనోభావాలను సున్నితంగా, సువాసన భరితంగా, అర్థవంతంగా అవతలివారికి తెలియజేసేందుకు పూలని మించిన సాధనాలు వేరే లేవనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu