Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : బలపడుతున్న స్త్రీ శక్తి... కానీ...?!!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : బలపడుతున్న స్త్రీ శక్తి... కానీ...?!!
, గురువారం, 7 మార్చి 2013 (21:26 IST)
FILE
మార్చి 8 వస్తే మహిళలకు పండుగే... ఎందుకంటే మహిళా దినోత్సవ సంబరం వారి ముంగిట పలుకరిస్తుంది. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగలోకి మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది.

పూర్వకాలంలో స్త్రీలు వంటగదికే పరిమితమయ్యేవారు, బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాజారామ్మోన్ రాయ్, అంబేద్కర్ మొదలగు మహానుభావులు స్త్రీ అభ్యున్నతికి పాటుపడ్డారు. కాని స్త్రీలు ఇంత అభివృద్ధి, ప్రగతి సాధించినప్పటికీ వారికి గౌరవం లభిస్తుందా, స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందా, వారి కలలు సాకారం అవుతున్నాయా అంటే ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఇలావుంటే స్త్రీపై అఘాయిత్యాల పరంపర రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి.

ఉదాహరణకు ఇటీవల ఢిల్లీలో పారామెడికల్ స్టూడెంట్ జ్యోతి సింగ్ పాండేపై జరిగిన సామూహిక అత్యాచారమే నిదర్శనం. కెరీర్‌లో పైకెదిగి తన ఇద్దరు సోదరులకు మంచి విద్యను అందించాలని ఆమె కలలు కన్నది. అయితే, ఆమె స్వప్నం గత డిసెంబర్ 16వ తేదీన బద్దలైంది. ఢిల్లీలో ప్రయాణిస్తున్న బస్సులో ఆమె ఆరుగురు వ్యక్తుల చేత సామూహిక అత్యాచారానికి గురై, అసువులు బాసింది. ప్రాణాలతో 13 రోజుల పాటు పోరాటం చేసి చివరికి డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని మహాత్ముడు జాతికి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పటికీ అది సాకారం కాలేదు.

అంతకంతకూ స్త్రీలపై హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కామపిశాచులు వారిని వదలట్లేదు. ముంబై మహానగరంలో జనవరి 27వ తేదీన ఆరు నెలల ఆడశిశువుపై అత్యాచారం జరిగింది. మార్చి 2 ఢిల్లీలో ఏడెళ్ళ బాలికపై అత్యాచారం, తాజాగా ఓ కీచకుడు మిత్రుడి భార్యపైనే ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని శివాన్‌కు చెందిన మహిళపై ఆమె భర్త స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఓ విద్యార్థి చదువులు చెప్పే ఉపాధ్యాయురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

భారతదేశంలో ఇప్పటివరకూ నిమిషాల వ్యవధిలో రేప్ కేసులు నమోదవుతున్నాయి. దీనినిబట్టి చూస్తే మహిళ మగవాడి చేత ఎంతగా బాధించబడుతుందో అర్థమవుతుంది. అలాగని స్త్రీలు వెనుకబడిపోయారనేది కాదు. వారు ఎంత అభివృద్ధి చెందుతున్నా స్త్రీని అలాగే చూస్తున్నారు తప్ప వారిపై గౌరవం చూపించడం లేదు. ఆడది అబల కాదు మహాశక్తి అని నిరూపించే యువతులూ భరతగడ్డపై పుట్టారు.

బ్రిటీష్ వారిని ఒంటిచెత్తో తరిమికొట్టిన ఝాన్సీ రుద్రమదేవీ, కవి కోకిల సరోజిని నాయుడు, పరుగుల రాణి పీటి ఉష, భారతి సంతతకి చెందిన సునీతా విలియమ్స్, రాజకీయాల్లో వెలుగొందుతున్న సుష్మా స్వరాజ్, సోనియా గాంధీలు ఉన్నారు. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్ర హొంశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి మొదలు గీతారెడ్డి, డి.కె.అరుణ వంటి వారిదగ్గర్నుంచి ఎమ్మెల్యే. వైఎస్ విజయమ్మ మొదలగు రాజకీయ నాయకురాళ్లు ఉన్నారు.

అలాగే ఇంకా ఇతర రంగాల నుండి చాలామంది ఉన్నారు. వారిలో టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా, సైనా నెహ్వాల్, జబర్దస్త్ డైరెక్టర్ నందినీ రెడ్డి, నిర్మాత, నటి విజయనిర్మల, డాన్స్‌ర్ శోభ నాయుడు, యాంకర్ సుమ, ఝాన్సీ, ఉదయభాను వీరంతా తమతమ రంగలలో శక్తివంతమైన మహిళలుగా నిరూపించుకున్నారు. దీనిని బట్టి చూస్తే స్త్రీ ప్రగతి సాధించి శక్తివంతమయింది. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నారు. దీని నుంచి వారిని రక్షించాలంటే చట్టాలు మరింత కఠినతరం చేయాలి. అప్పుడే మన దేశ మహిళలకు నిజమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Share this Story:

Follow Webdunia telugu