Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీమ చిన్నోడు.. సాహితీ తపస్వి "పులికంటి"

సీమ చిన్నోడు.. సాహితీ తపస్వి
'
FILE

రాయలసీమ చిన్నోడు'గా అందరి గుండెల్లో నిలిచిన సాహితీ తపస్వి పులికంటి కృష్ణారెడ్డి. నటుడిగా, రచయితగా, కవిగా, కథకుడిగా, రంగస్థల కళాకారుడిగా, బుర్రకథ గాయకుడిగా... తన సాహితీ జీవనంలో విభిన్న పాత్రలను పోషించారీయన. సభా, రాజారాం గార్ల తర్వాత చిత్తూరు జిల్లా భాషకు పండిత గౌరవం కల్పించిన అద్వితీయమైన రచయిత మన పులికంటి.

నాలుగున్నర ఐదు దశాబ్దాల సాహిత్య జీవితం కలిగిన పులికంటి... రాయలసీమ జీవన వ్యథలను కథలుగా మలచి దాదాపు 200 సంపుటాలుగా వెలువరించిన సహజ కథకుడు. తనదైన శైలితో, సీమ యాసతో, జీవం ఉట్టిపడే పదాలతో అన్ని రకాల సమస్యలను తన రచనల్లో మేళవించి అందించిన మన అచ్చ తెలుగు కవి పులికంటి జన్మదినం సందర్భంగా ఈ చిన్ని వ్యాసం...
నాలుగ్గాళ్ల మండపంలో...!
తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబించే "నాలుగ్గాళ్ల మండపం" రచన ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. తనకు ఎలాంటి వాదాలు, ఇజాలు తెలియవని చెప్పుకున్నా ఆయనకు ఖచ్చితమైన రాజకీయ దృష్టి ఉందనే విషయాన్ని ఈ మండపం తెలియజేస్తుంది...
webdunia


చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, జక్కిదోన అనే గ్రామంలో... 1931 జూలై 30వ తేదీన పులికంటి కృష్ణారెడ్డి ఓ రైతు కుటుంబంలో జన్మించారు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేశాఖలో ఉద్యోగం చేసిన ఈయన... నాటకాలమీద మక్కువతో దాన్ని వదులుకుని పూర్తిగా సాహిత్యానికే అంకితమయ్యారు.

ఆ రకంగా సాహితీ ప్రయాణం సాగించిన పులికంటి... దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్య నాటికలు, 6 శ్రవ్య నాటికలు, 10 బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలితో కూడిన 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలను రాశారు.

రాయలసీమ వెతల నేపథ్యంలో ఈయన రాసిన 200 కథలను వెలువరించటమేగాకుండా... గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని అనే పేర్లతో పలు సంపుటాలను వెలికితెచ్చారు. ఇక పులికంటి రాసిన అమ్మి పాటలయితే, నండూరి సుబ్బారావు ఎంకి పాటలకు దీటుగా నిలిచి సీమవాసులను అలరించాయి.

పులికంటి రచనల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది "నాలుగ్గాళ్ళ మండపం". తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబించే ఈ రచన ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టింది. కథానికకు చెందకుండా, స్కెచ్‌కు చెందకుండా రెండింటినీ మేళవించుకున్న ఒక ప్రక్రియ, కథన ప్రక్రియ. ఈ ప్రక్రియకు పులికంటి నాలుగ్గాళ్ళ మండపం రచన ద్వారా స్థిరమైన రూపాన్ని సాధించి పెట్టారు.

ఒకటి ఒకటిన్నర దశాబ్ది కాలంలో వచ్చిన ఆర్థిక, రాజకీయ పరిణామాల వ్యాఖ్యానాలుగా సాగిన "నాలుగ్గాళ్ళ మండపం"లో... పులికంటి భావజాలం, ఇష్టాయిష్టాలు, ఆయనకు తెలిసిన చరిత్ర అన్నీ స్వస్వరూపాలతో దర్శనమిస్తాయి. తనకు ఎలాంటి వాదాలు, ఇజాలు తెలియవని చెప్పుకున్నా ఆయనకు ఖచ్చితమైన రాజకీయ దృష్టి ఉందనే విషయాన్ని ఈ మండపం తెలియజేస్తుంది.

రచయితగా, కవిగా తన సాహితీ, కళారంగాల కృషికిగానూ పలు బిరుదాలను, సన్మానాలను పొందిన పులికంటి... తాను రాసిన "అగ్గిపుల్ల" నవలకుగానూ చక్రపాణి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఆడిషన్ కమిటీ సభ్యుడిగా, సలహాదారుగా ఆయన కొంతకాలం పనిచేశారు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో ఈయన రాసిన వ్యాసాలను "పులికంటి హృదయ చిత్రాలు" పేరుతో పుస్తకంగా ప్రచురించారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005వ సంవత్సరంలో పులికంటిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కాగా... ఈయన రచనలమీద పరిశోధనలు చేసిన నలుగురు విద్యార్థులు పీహెచ్‌డీ డిగ్రీని, ముగ్గురు ఎంఫిల్ డిగ్రీని పొందారు. ఇదిలా ఉంటే... సాహితీ సంస్కృతి అనే సంస్థను స్థాపించిన పులికంటి, ప్రతియేటా సాహిత్య, కళారంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరించేవారు.

2007వ సంవత్సరంలో తిరుపతి పట్టణంలో జరిగిన "తెలుగు భాషా బ్రహ్మోత్సవాల" సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంవారు పులికంటిని ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు. అయితే ఆ భాషా బ్రహ్మోత్సవాలకంటే ముందుగానే అంటే 2007, నవంబర్ 19వ తేదీన ఆయన కాలధర్మం చెందారు.

Share this Story:

Follow Webdunia telugu