టాలీవుడ్‌లో ఈరోజున హండ్రెడ్ పర్సెంట్ క్రేజ్ కలిగిన హీరోయిన్లలో 'తమన్నా' ఒకరు. తమన్నా కాల్షీట్స్ తీసుకోగలిగితే, టాప్ హీరోల కాల్షీట్స్ సంపాదించుకోవడం చాలా సులువైపోతుందనేంతగా తమన్నా హవా నడుస్తోంది. 'హ్యాపీడేస్'తో క్లాస్ ఆడియన్స్‌ను తన కొంగుకు కట్టేసుకున్న తమన్నా... ఆ తర్వాత 'వీడొక్కడే', 'ఆవారా' వంటి తమిళ అనువాద చిత్రాలతో మాస్ ఆడియన్స్‌నూ తన సొగసుల బుట్టలో వేసేసుకుంది.
ఇక '100% లవ్', 'బద్రినాథ్', చిత్రాలలో తమన్నా అందాలు సృష్టిస్తున్న అలజడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలతో డామినేట్ చేయబడే తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల డామినేషన్‌తో పోటీ పడేంత క్రేజ్ సంతరించుకున్న హీరోయిన్లు తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి నేటివరకూ కేవలం వేళ్ళతో లెక్కించగలిగే వాళ్ళు మాత్రమే ఉన్నారు. నేటితరం హీరోయిన్లలో ఆ ఘనతను సొంతం చేసుకున్న హీరోయిన్‌గా తమన్నాను చెప్పుకోవచ్చు. తమన్నా కోసం, తమన్నా అందాల కోసం థియేటర్ల ముందు బారులు తీరే ప్రేక్షకాభిమానులు నేడు లక్షల్లో ఉన్నారు.
మీ కుటుంబ నేపథ్యం..?
మాది సింధీ కుటుంబం. అమ్మ పేరు రజని. నాన్న పేరు సంతోష్. నాకు ఒక అన్నయ్య ఉన్నారు. పేరు ఆనంద్. తను ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. ముంబై మా స్వస్థలం.
మీ సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
నాకు చిన్నప్పట్నుంచి హీరోయిన్ కావాలనే ఉండేది. అదృష్టవశాత్తు నా తల్లిదండ్రులు నన్నెప్పుడూ డిస్కరేజ్ చేయలేదు. దాంతో నా 13వ ఏటే నేను సినీరంగ ప్రవేశం చేశాను. 'చాంద్‌సా రోషన్ బెహ్రా' అనే హిందీ చిత్రమది. ప్రస్తుతానికి అదే చివరి హిందీ చిత్రం కూడా. ఎందుకంటే ఆ చిత్రం తర్వాత నేను మళ్ళీ హిందీ సినిమా చేయలేదు. 'శ్రీ' చిత్రంతో తెలుగులో ఆఫర్ రావడం, ఆ తర్వాత నా కెరీర్‌లో 'హ్యాపీడేస్' మొదలు కావడం మీకు తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి నా కెరీర్ గురించి నాకంటే మీకే బాగా తెలుసు (పెద్దగా నవ్వుతూ).