అమెరికా డ్రోన్ దాడుల్లో ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ నేత ముల్లాహ్ అక్తార్ మన్సూర్ మృతి చెందినట్టు ఆప్ఘన్ తాలిబన్ తీవ్రవాదులు స్పష్టం చేశారు. అదేసమయంలో తమ కొత్త నేతగా ముల్లా హైబతుల్లా అకుందాజాదాను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
పాకిస్థాన్లో ఉన్న బలూచిస్థాన్ ప్రాంతంలో గత శనివారం అమెరికా ప్రత్యేక దళాలు మానవరహిత డ్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో మన్సూర్ హతమైనట్టు అమెరికా, ఆప్ఘనిస్థాన్ అధికారులు ధ్రువీకరించారు. అహ్మద్ వాల్టౌన్కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బందిలో ఒక వాహనంలో మన్సూర్, మరొక మిలిటెంట్ వెళుతుండగా ఈ దాడులు జరిపి హతమార్చాయి.
ఈ విషయాన్ని తాలిబన్ తీవ్రవాదులు తాజాగా ధృవీకరించారు. తాలిబన్ల నాయకుడు ముల్లాహ్ మహమ్మద్ ఒమర్ మరణించడంతో 2015 జులైలో మన్సూర్ను తాలిబన్ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అతడి మరణంతో ముల్లా హైబతుల్లాను కొత్తనేతగా ప్రకటించారు.