వారు ఎంతటి వారినైనా సరే.. సంతానం లేకపోవడం చాలా బాధిస్తుంది. ఇది జీవితంలో తీరని వ్యధగా మిగిలిపోతుంది. సమాజంలో ఎక్కువగా సంతాన లేమికి భార్యను నిందిస్తుంటారు... ఇది ఎంతవరకూ సహేతుకం? ఏం భర్త లోపం ఉండదా...! భార్య మాత్రమే కారణమా.. ఇద్దరి లోపం ఉండదా..! దీనిని ఏ విధంగా అధిగమించవచ్చు. సంతాన లేమితో బాధపడే వారు ఇక శాశ్వతంగా అలాగే ఉండిపోవాల్సిందేనా.. మార్గాలేమున్నాయి.? ఇలాంటి ఎన్నో అంశాలపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఆశాలతతో వెబ్ దునియా ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ..
వెబ్ దునియా ప్రతినిధి : హలో.. డాక్టర్ గుడ్ మార్నింగ్..
డాక్టర్ ఆశా లత : గుడ్ మార్నింగండీ..
వె.ప్ర. : సంతానలేమికి కేవలం ఎవరు కారణం..? భార్య మాత్రమే బాధ్యురాలా..!
డా. ఆశాలత : ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అనాదిగా కేవలం మహిళను మాత్రమే బాధ్యురాలిని చేస్తున్నారు. ఆమెపైనే నిందలు వేస్తున్నారు. గొడ్రాలంటూ వేధిస్తుంటారు. భార్య మాత్రమే కారణమనడంలో వాస్తవం లేదు. సంతానలేమికి భార్యాభర్తలిద్దరూ బాధ్యులే. 50 శాతం భార్య అయితే, 50 శాతం భర్త కారణమవుతారు.
వె.ప్ర. : ఇరువురూ ఎలా కారణమవుతారు?
డా. ఆశాలత : ఇది సహజంగా అందరిలో కలిగే అనుమానమే. గర్భసంచి ఉన్నంత మాత్రనా స్త్రీ ఒక్కదాని వలననే సంతానోత్పత్తి కలుగదు. మగవారితో కలసినప్పుడేగా అది సాధ్యమవుతుంది. అలాంటప్పుడు మగవారిలో వీర్యకణాలు తక్కువగా ఉండడం లేదా వాటి కదలిక తక్కువగా ఉండడం వంటివి కూడా సంతానలేమి కారణమవుతాయి. అలాగే విగత వీర్యకణాలు ఎక్కవగా ఉండడం లేదా వీర్యకణాలు వేగంగా ముందుకు చొచ్చుకు పోలేక పోవడం లేదా అసలు వీర్య కణాలే లేకవడం సంతానలేమికి కారణాలవుతాయి. ఇన్ని కారణాలను పెట్టుకుని మరి కేవలం భార్యను మాత్రమే ఎలా తప్పుబట్టగలం...
వె.ప్ర. : మగవారిలో ఈ లోపాలను సరిచేసే మార్గాలు లేవా..?
డా. ఆశాలత : ఇది ఆధునిక యుగమండీ.. సైన్సు చాలా డెవెలప్ అయ్యింది. ఎన్నో మాత్రలు, గ్రామ్యాల్స్ అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని, లోపం తీవ్రతను అనుసరించి డాక్టర్ల సూచన మేరకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది. అంతే కాదు. రక్తనాళాలు ఉబ్బి వీర్యకణాలు తక్కువగా ఉత్పత్తి అయ్యే పరిస్థితే ఉంటే శస్త్రచికిత్స ద్వారా కూడా వాటిని సరిచేస్తారు. ఈ లోపాలను సరిచేసుకోవడం ద్వారా సంతాన సాఫల్యం కలుగుతుంది.
వె.ప్ర. : మరి మహిళల్లో ఎలాంటి లోపాలుంటాయి.?
డా. ఆశాలత: సంతానలేమికి మగవారు ఎంత కారణమో ఆడవారు కూడా అంతే కారణమవుతారు. గర్భాశయంలో గడ్డలుండడం, గర్భాశయంలో అడ్డుగోడలుండడం, పుట్టుకతోనే గర్భసంచిలో లోపాలుండడం సాధారణ కారణాలవుతాయి. ఇవే కాకుండా గర్భాశయాల నుంచి అండాలను తీసుకెళ్ళే గొట్టాలు(పాలిషియన్ ట్యూబ్) మూతపడినప్పుడు సంతానోత్పత్తి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
వె.ప్ర. : మరి మహిళలలోని లోపాలను సరిచేయడం ఎలా?
డా. ఆశాలత : గర్భసంచిలోని గడ్డలను, అడ్డుగోడలను లాప్రోస్కోపి, హిస్కిరోస్కోపి ద్వారా తొలగించవచ్చు. అంతే కాదు. పూర్తిగా మూసుకుపోయిన పలోషియన్ ట్యూబులను తెరవవచ్చు. డ్రిల్లింగు చేయడం ద్వారా గర్భసంచిలోని లోపాలను సరిచేయవచ్చు. వారికి సంతాన ప్రాప్తి కలిగించవచ్చు.
వె.ప్ర. : అన్నీ సక్రమంగా ఉండీ సంతానం లేని దంపతుల పరిస్థితి ఏంటి?
డా. ఆశాలత : యస్...! ఇలాంటి కేసులు కూడా ఉంటాయి. ఇందుకు చాలా మటుకు అండోత్పత్తి అయ్యే రోజులపై అవగాహన లేకపోవడమే. ఉద్యోగరిత్యా వారు వేర్వేరు ప్రదేశాలలో ఉంటూ సరిగ్గా కలుసుకోలేకపోవడం జరుగుతుంటుంది. వీరికి అండోత్పత్తి అయ్యే రోజులపై అవగాహన కల్గించడం, ఆ రోజుల్లో ఇద్దరూ ఒకే చోట ఉండి సంసార జీవితం గడపడం ద్వారా సంతాన సాఫల్యం కలుగుతుంది.
వె.ప్ర. : మరి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు టెస్టట్యూబ్ బేబీ పద్దతిని ఎందుకు అనుసరిస్తారు?
డా. ఆశాలత : నిజమే... సహజంగా వచ్చే అనుమానమే. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇంతవరకూ మనం మహిళలు, పురుషులలోని లోపాలను పరిష్కారమార్గాలను చెప్పుకున్నాం. వాటిలో అన్నీ విఫలమయినప్పుడు ఈ పద్దతిని వినియోగిస్తారు. భర్త వీర్యకణాలు తక్కువగా ఉండి వాటిని అభివృద్ధి చేసే అవకాశం లేనప్పుడు, భార్య అండవాహిక పూర్తిగా మూత పడినప్పుడు, ఏ కారణం లేకున్నా స్వతహాగా గర్భం రానప్పుడు టెస్టుట్యూబ్ బేబీ విధానానికి వెళ్ళాల్సి ఉంటుంది.
వె. ప్ర : మరి ఇలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఏంటి?
డా. ఆశాలత : భర్తలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు వాటిని డెవెలప్ చేయలేని స్థితిలో తక్కువగా ఉన్న వీర్యకణాలనే సేకరిస్తారు. అసలు వీర్యకణాలే లేనప్పుడు బీజం నుంచి కణాలను సంగ్రహిస్తారు. వీటిని భార్య అండాలతో ఫలదీకరణం చెందించి గర్భసంచిలో ప్రవేశపెడతారు. భార్యలో గర్భసంచి సమస్య ఉన్నట్లైతే గర్భాశయం నుంచి అండాలను తీసి ఒక్కొక్కటిగా భర్త వీర్యకణాలతో ఫలదీకరణం చెందించి ఆ ఎంబ్రియోను గర్భసంచిలో పెడతారు. ఈ పద్దతినే టెస్టుట్యూబ్ బేబీ విధానం అంటారు. దీని ఖర్చు సాధారణ స్థాయి నుంచి అండాల విడుదలకు వినియోగించే హార్మోన్ ఇంజక్షన్లను అనుసరించి ఉంటుంది. అదే సమయంలో వీర్యకణాల సేకరణ విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది.
వై.ప్ర. : సరగోసి విధానం ఎప్పుడు అనుసరిస్తారు?
డా. ఆశాలత : భార్య గర్భాశయం పూర్తిగా చెడిపోయినప్పుడు లేదా తీసేసినప్పుడు వినియోగించే పద్దతి. అప్పుడు భార్య అండాలను సేకరించి భర్త వీర్య కణాలలోకి పంపి ఏర్పడ్డ ఎంబ్రియోను అద్దె గర్భం(బిడ్డను తన కడపులో పెరగడానికి అంగీకరించిన మహిళ గర్భం)లోకి ప్రవేశ పెడతారు. ఈ విధానాన్ని సరగోసి విధానం అంటారు. ఇది కూడా ఖర్చుతో కూడుకున్నదే.