"రాజ్‌కపూరే" ఆ మాటన్నారు.. మరి నేనెంత..?: కరుణాకరన్
తొలిప్రేమ, యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా.. వంటి చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "డార్లింగ్". ఈ చిత్రం విడుదలై పదిరోజులు పూర్తయిన సందర్భంగా దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. "డార్లింగ్" సినిమాకి ప్రతిచోటా మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో కరుణాకరన్‌తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..ప్రశ్న: "డార్లింగ్"కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది?జ : ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో చూశాను. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర కథ విన్నప్పుడు కూడా ప్రభాస్ కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. ప్రశ్న: మీరు కథలు రాసి హీరోలను ఎంపికచేస్తారా..?జ : ముందుగా పలానా హీరోని దృష్టిలో పెట్టుకుని కథ రాసుకుంటాను. అలా రాసుకున్నదే నా తొలిప్రేమ. అది పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అప్పటి నుంచి డార్లింగ్ వరకు హీరోను బేస్‌చేసుకునే కథ రాశాను. ప్రశ్న: "డార్లింగ్"కి ప్రభాస్ సూటయ్యాడని అనుకుంటున్నారా..?జ : సూటవుతారనే కథ రాసుకున్నాను.ప్రశ్న: ముందుహా వేరే హీరో పేరు వినిపించింది..?జ : అదేం కాదు. కాకపోతే.. మాస్ హీరోతో ప్రేమకథను చేసి మెప్పించడం కష్టమైన పనేనని యూనిట్‌లో చాలామంది అన్నారు. ఆ తర్వాత కొంత చర్చకూడా జరిగింది. కానీ ఎంతటివారికైనా ప్రేమ హృదయం ఉంటుంది. దాన్ని ఆ కోణంలో చూపించాలనే ప్రయత్నం చేశాం. ప్రశ్న: ఈ చిత్ర కథకు స్ఫూర్తి ఏమైనా ఉందా..?జ : డార్లింగ్ కథ వెనుక ఓ రియల్ స్టోరీ ఉంది. నాకు తెలిసిన 8 మంది స్నేహితులు 30 ఏళ్ళుగా కలిసిమెలిసి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. వారంతా డాక్టర్లు కావడం విశేషం. వారి మధ్య జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా ఈ కథను రాసుకున్నాను. ప్రశ్న: మీ కథలో అబద్ధం, నిజం ఏది మీకు నచ్చింది..?జ : మొదటి భాగం అబద్ధం అనేది కొత్త స్క్రీన్‌ప్లేగా ఎంచుకున్నాం. దానివల్ల ఎవ్వరూ ఇబ్బంది పడలేదు. కథ విన్నప్పుడే ప్రభాస్ బాగుందన్నారు. తను ప్రేమిస్తున్న ప్రేయసి గురించి గొప్పగా చెప్పడం.. తను ఆపదలో ఉన్నప్పుడు దాన్నుండి బయటపడటానికి ఎవరైనా కథలు చెబుతారు. అలా హీరో చెప్పిన కథే మొదటి భాగం. ఇక రెండో భాగం చాలా రియలిస్టిక్‌గా ఉంది. దీన్ని అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. ప్రశ్న: "డార్లింగ్"లో హీరోయిన్‌కు ఎప్పుడూ తెల్లటి వస్త్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు? సెంటిమెంటా..?జ : తెల్లిని వస్త్రాలు శుభసూచకాలు. అందులోనే అన్ని రంగులుంటాయి. తొలిప్రేమలో అలానే చూపాను. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..లో హీరోయిన్ యోగా చేస్తుంది కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించింది. డార్లింగ్‌లో క్రైస్తవులు ప్రార్థన చేసేటప్పుడు పాటలు పాడే సన్నివేశంలో తెల్లటి వస్త్రాలే ధరిస్తారు. ఇలా కథకు సరిపడా విధంగానే దుస్తులు ఉంటాయి. ప్రశ్న: "డార్లింగ్" అనే ప్రేమకథను అద్భుతంగా తెరకెక్కించారు. మరి మీది లవ్ మేరేజా..?జ : లవ్ అండ్ ఎరేంజ్‌మేరేజ్. నాకు పెళ్ళై పది సంవత్సరాలైంది. ప్రశ్న: అందుకే ఎప్పుడూ లవ్ చిత్రాలే తీస్తుంటారా..?జ : లవ్ చిత్రాల్లో చెప్పాల్సింది చాలా ఉంది. నాకు తెలిసింది.. కొంత మేరకే. రాజ్‌కపూర్ లాంటి లెజెండే.. ప్రేమకథల్లో చెప్పాల్సింది కొండంత ఉందని చెప్పారు. మరి నేనెంతవాడిని.. నాకు ప్రేమ చిత్రాలంటేనే ఇష్టం.ప్రశ్న: మీ తదుపరి చిత్రం..?జ : ప్రముఖ హీరోతో ప్రేమ కథ ఆధారంగా కొత్త సినిమా చేస్తాను. త్వరలో వివరాలు తెలియజేస్తాను.