Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమితాబ్‌ బాటలో నాగార్జున... 'మీలో ఎవరు కోటీశ్వరుడు'

అమితాబ్‌ బాటలో నాగార్జున... 'మీలో ఎవరు కోటీశ్వరుడు'
, శనివారం, 19 ఏప్రియల్ 2014 (12:20 IST)
WD
అమితాబ్‌ బాటలో నాగ్‌ పయనిస్తున్నాడు. సినిమా నుంచి టీవీ రంగంలోకి వచ్చారు. కామన్‌మేన్‌ కలను సాకారం చేయాలనే సదుద్దేశ్యంతో మాటీవీ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే గేమ్‌ షోను త్వరలో ప్రసారం చేయనుందని నటుడు అక్కినేని నాగార్జున వెల్లడించారు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌ సారధ్యంలో వచ్చిన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' గేమ్‌ షో ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ స్పూర్తితో వివిధ భాషల్లో ఎన్నో టీవీ కార్యక్రమాలు రూపుదిద్దుకుని విజయవంతమయ్యాయి.

ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున వ్యాఖ్యాతగా మాటీవీ కోటి రూపాయల బహుమతితో తెలుగులో ప్రప్రథమంగా ఈ గేమ్‌ షోకి రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాటీవీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ... తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి మాటీవీ చేరుకోవడం ఎనలేని ఆనందాన్ని కల్గిస్తోంది. దానిని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతోపాటు, సామాన్యుడి కల నెరవేర్చాలన్న సదాశయంతో ఈ షోని రూపొందించాం.

అలాగే ఈ షో ద్వారా అందరినీ విజ్ఞానవంతులను చెయ్యాలన్నదే మా ఆకాంక్ష. దీని ద్వారా నేను కూడా విజ్ఞానాన్ని మరింతగా సముపార్జించేందుకు అవకాశం కలుగుతుంది. ఇలాటి షోల వల్ల మనపై మనకు మరింత నమ్మకం ఏర్పడుతుంది. ఒక సామాజిక బాధ్యతగా ఈ షోని చేసేందుకు నేను అంగీకరించాను. ఒక్కమాటలో చెప్పాలంటే బుల్లితెరపై నేను ఎత్తుతున్న కొత్త అవతారమిది.

గత వారం నుంచి ఈ షోకి సంబంధించిన ప్రాక్టీస్‌ చేస్తున్నాను. వాస్తవానికి నేను అనుకున్నంత సుళువు కాదిది. ఎంతో ఏకాగ్రతతో చేయాల్సిన షో ఇది. నాలుగైదు సినిమాలు చేసిన దానికంటే ఇది మరింత కష్టంగా ఉంది. అయినప్పటికీ ఇలాంటి మంచి ప్రోగ్రాం చేసే అదృష్టం నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది' అన్నారు.

ఇదే వేదికపై నాగార్జున, అమల దంపతులు ఓ ట్రైల్‌ షో చేశారు. అందులో భాగంగా అమల కొన్ని ప్రశ్నలను నాగార్జునకు సంధించారు. అయితే అవి సరదాగా వ్యక్తిగత ప్రశ్నలు కావడంతో నవ్వులు పువ్వులు విరిశాయి. ఇదే వేదికపై పాల్గొన్న మాటీవీ ఛైర్మన్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఆరేళ్ళ క్రితం మేము మాటీవీలో భాగస్వాములయ్యాం.

దీనికి ఇంత పేరు రావడానికి చిరంజీవి, నాగార్జున కుటుంబాలు ఎంతగానో కృషి చేశాయి. మా అందరి ఆలోచనలకు అనుగుణంగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్‌ చేయదలచుకున్నాం' అని చెప్పారు. ఇంకా మాటీవీ డైరెక్టర్‌ అల్లు అరవింద్‌, ఈ షో నిర్మాత సిద్దార్థబసు, అనిత తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu