Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

“పాలకడలిపై శేషతల్పమున …”

“పాలకడలిపై శేషతల్పమున …”

Raju

, సోమవారం, 21 ఏప్రియల్ 2008 (13:07 IST)
SriniWD
అసలే గంధర్వగాయని ఆపై అమృతం సేవించింది అన్న చందాన తెలుగు సినీ గాన ప్రపంచంలో మెరిసిన తెల్లకోకిల పి. సుశీల. 600 సంవత్సరాల క్రితం భక్తి సాహిత్యంతో, జానపదరీతులతో తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య ఆనాటి తెలుగు సమాజం బాధలను, జీవన వేదనను భగవంతునికి నివేదించడం ద్వారా చరిత్ర సృష్టిస్తే, ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న గానకోకిల సుశీల గారు.

మూడు దశాబ్దాల క్రితం ఘంటసాల, సుశీల, లీల, జానకి వంటి అమరగాయనీ గాయకులు తెలుగు సినీ గీతాలలో భక్తితత్వాన్ని శిఖరస్థాయికి తీసుకుపోగా, సుశీలగారు భగవంతునికి బాధలను, సమస్యలను ఏ రీతిలో నివేదించాలో తనదైన దివ్యస్వరంతో తెలుగు జాతికి నేర్పించారు. ఆమె పాడిన వేలాది పాటల్లో చెంచులక్ష్మిలోని పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా.. పాట కళ్యాణి రాగంలో కుదిరిన ఓ అద్భుతమైన గీతంగా తెలుగు సినీ గేయ చరిత్రలో నిలిచిపోయింది.

ఈ నాటికీ సుశీల గారు ఏ సందర్భంలో అయినా వేదికలు ఎక్కడమంటూ జరిగితే ఆమె అభిమానులు, రసజ్ఞులు పట్టుపట్టి మరీ ఈ పాటను కోరి ఆమెచే పాడించుకుంటారంటే, ఈ పాట తెలుగుజాతి హృదయాంతరాళాలను ఎలా మీటిందో చెప్ప పనిలేదు.

చెంచులక్ష్మి సినిమాలోని “పాలకడలిపై శేషతల్పమున …” అన్న గొప్ప భక్తి పాటను కల్యాణి రాగంలో సాలూరు రాజేశ్వరరావు గారు కూర్చారు.

సామాన్య మానవులకు అందరాని పాల సముద్రంలో ఆదిశేషువు పడగ నీడలో పవళించిన మహావిష్ణువును మొక్కుతూ, పసిబాలుడు కరుణించవా దేవా అంటూ మొరపెట్టుకుంటున్న ఈ మంత్రగానాన్ని మళ్లీ ఒకసారి వినండి... తెలుగు పాట అనేది ఉన్నంత వరకూ చిరస్థాయిగా నిలిచే ఈ గాంధర్వ గానాన్ని సుశీల దివ్య స్వరం ద్వారా వీలైతే ఒకసారి తిరిగి విని తరించండి....

ఈ పాటను వినే అరుదైన అవకాశం చెన్నైలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఇండియన్ తెలుగు అసోసియేషన్ (ఐటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు జి.నగష్ కల్పించారు.

Share this Story:

Follow Webdunia telugu