ఏపీలోని కోనసీమ జిల్లాలోని అమలాపురంలో దారుణం జరిగింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 యేళ్ల బాలికపై ఐదుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం బయటపడటంతో బాధితురాలి కుటుంబంతో కామాంధులు గ్రామ పెద్దల సమక్షంలో లక్ష రూపాయలు ఇచ్చి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కానీ, బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమలాపురం సమీపంలోని కాట్రేనికోన మండలంలోని సముద్రతీర గ్రామమైన చిర్ర యానాంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఈ నెల 6న బట్టలు ఉతికేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఐదుగురు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెను సరుగుడు తోటలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు.
ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురికాగా, తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా, గ్రామ పెద్దల సమక్షంలో నిందితులు లక్ష రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
అయితే, ఆ సొమ్మును తీసుకునేందుకు వారు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం డీఎస్పీ వై.మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.