కామాంధులకు కన్నూమిన్నూ కానరాకుండా పోతోంది. అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదిలిపెట్టడంలేదు. ప్రజలను కాపాడాల్సిన కుటుంబంలో వుండి కూడా చిన్నారిని కాటు వేసాడు ఆ కామాంధుడు.
వివరాలు చూస్తే... సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గ్రామ సర్పంచి ఇంట్లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న మహిళ కుటుంబం అద్దెకు వుంటున్నారు. విధులకు హాజరయ్యేందుకు ఇరువురు భార్యాభర్తలు వెళ్లే సమయంలో తమ ఆరేళ్ల చిన్నారిని సర్పంచ్ ఇంట్లో వదిలి వెళ్లేవారు. ఐతే సర్పంచి భర్త చిన్నారిపై పడింది. అదను కోసం చూస్తున్న ఆ కామాంధుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు చాక్లెట్ ఇస్తానని పిలిచి లైంగిక దాడి చేసాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారి తల్లి, బాలిక అనారోగ్యంగా వుండటాన్ని గమనించింది. విషయం ఏంటని అడుగ్గా... జరిగిన దారుణాన్ని తెలిపింది. వెంటనే బాధిత బాలిక తల్లిదండ్రులు సర్పంచి భర్తను నిలదీశారు. దాంతో తనకేమీ తెలియదని బుకాయించడమే కాకుండా వారిద్దర్ని ఇంట్లో పెట్టి తాళం వేసి బంధించాడు.
చివరకి తమ బంధువుల సాయంతో ఇంట్లో నుంచి బయటపడి అతడిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెప్పడంతో బాధితులు వెనుదిరిగారు.