భారత క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ మైదానంలో సీరియస్‌గా కనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం సరదాగా ఉంటాడు. భారత మాజీ కెప్టెన్, మాజీ కోచ్/మేనేజర్ అజిత్ వాడేకర్ కూడా సచిన్‌ను తమాషా వ్యక్తి అంటున్నారు. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన సచిన్ 42వ జన్మదిన వేడుకలో వాడేకర్ మాట్లాడుతూ, సచిన్ గురించి చెప్పారు. 1994లో న్యూజిలాండ్ టూర్లో తాను భారత జట్టుకు కోచ్/మేనేజర్‌గా వ్యవహరించానని తెలిపారు. అప్పుడు తన 53వ (ఏప్రిల్ 1) జన్మదినం సందర్భంగా సచిన్ తమాషా చేశాడని గుర్తు చేసుకున్నారు.
పెందలాడే నిద్రపోయిన ఆయనను సచిన్ వచ్చి లేపాడట. ఏంటి విషయం అని అడిగితే, కపిల్ దేవ్ కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేశాడట. ఇదేమీ ఏప్రిల్ ఫూల్ వ్యవహారం కాదు కదా అనుకుంటూనే, వెంటనే పైజామా తొడుక్కుని కపిల్ రూంకు వెళ్లి చూడగా, అక్కడ జట్టు మొత్తం కనిపించిందని చెప్పారు. దాంతోపాటే ఓ కేకు, షాంపేన్ బాటిల్ కూడా దర్శనమిచ్చాయట. దీంతో, తాను ఆశ్చర్యానికి గురయ్యానని వాడేకర్ తెలిపారు.
ఇంతలో, ఓ మూల నుంచి అరడజను మంది బెల్లీ డ్యాన్సర్లు వయ్యారంగా వచ్చారని, అది తనకు మరింత షాకింగ్ అని పేర్కొన్నారు. మామూలుగా ఇలాంటి తమాషాలు సునీల్ గవాస్కర్ చేస్తుంటాడని, అతనక్కడ లేకపోవడంతో సచినే చేసుంటాడని నిర్ధారించుకున్నానని చెప్పుకొచ్చాడు.