ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా సాగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపై మాస్టర్ బ్లాస్టర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ పెదవి విరిచాడు. వాస్తవానికి భారత్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో బలమైన పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లను చిత్తుగా ఓడించి, క్రికెట్ అభిమానుల జేజేలు అందుకుంది.
అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం పూర్తిగా సంతృప్తి చెందలేదు. భారత జట్టు ప్రదర్శనపై సచిన్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ.. పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు భారత ప్రదర్శన చూస్తే సెమీస్ చేరుకునేందుకు మెరుగైన అవకాశముందన్నారు. భారత జట్టు ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నానన్నాడు. అయితే, ఇంతటితో సంతృప్తి చెందవలసిన పని లేదన్నాడు. ధోనీ సేన జోరు కొనసాగించాలన్నాడు.
భారత జట్టు ఆటగాళ్ల నైపుణ్యం గురించి, వారి సత్తా గురించి తనకు తెలుసునని చెప్పాడు. అందుకే జట్టు ఖచ్చితంగా సెమీస్ చేరుతుందనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇప్పటి వరకు భారత్ ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నానే తప్ప సంతృప్తిగా లేనని చెప్పాడు. వారు ఇంకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో శిఖర్ ధావన్, రహానేలపైన సచిన్ ప్రశంసలు కురిపించాడు.