ప్రకృతి కోక కుచ్చిళ్ల మడతల్లాంటి సౌందర్యం...!
అక్కడ ప్రకృతి పచ్చంచు కోక కట్టిన కొండపడుచులా కనిపిస్తుంటుంది. అక్కడి కొండల ముడుతలన్నీ ఆ పచ్చంచు కోక కుచ్చిళ్ల మడతల్లాగా అనిపిస్తుంటాయి. సమస్త మానవాళికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి లేలేత కిరణాలు పరచుకున్న ఇక్కడి పచ్చటి ఆకుల స్పర్శను, వాటిపైనుంచి వీచే కొండగాలిని ఆస్వాదించాలంటే... మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌కు వెళ్లాల్సిందే...!!ఈ సుందరమైన మహాబలేశ్వర్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అలాంటి వాటిని మూడు అంశాలుగా విభజించుకుంటే.. వాటిలో ఒకటి పాత మహాబలేశ్వర్, రెండోది మహాబలేశ్వర్, మూడోది పంచగని. మహాబలేశ్వర్‌కి కొద్ది దూరంలో పాత మహాబలేశ్వర్, 19 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్‌గఢ్ ఉన్నాయి. వీటని చూడాలంటే, సుమారు రెండు రోజులయినా పడుతుంది.మహాబలేశ్వర్‌లోని పాత మహాబలేశ్వర్ దాదాపు ఒక కొండ అంచుపై నెలకొని ఉంటుంది. అందువల్ల అక్కడ ఊరు ఏర్పడేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ఈ ప్రదేశానికి 5 లేదా 6 కిలోమీటర్ల దూరంలో కాస్త అనువైన ప్రదేశంలో ఓ ఊరు వెలసింది. ప్రస్తుతం దీన్నే మహాబలేశ్వర్ అని పిలుస్తున్నారు.మహాబలేశ్వర్‌లో పర్యాటకులు వీక్షించే ప్రతి ప్రదేశానికీ ఏదో ఒక పేరుంటుంది. దాన్నే "పాయింట్" అంటుంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, ఆర్థర్ పాయంట్, కేట్స్ పాయింట్, బాంబే పాయింట్ వగైరాల్లాంటివన్నమాట. ఈ ప్రాంతంలో ఇలాంటివి సుమారు 30కి పైగానే ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది సూర్యాస్తమ దృశ్యాన్ని వీక్షించే ప్రదేశాన్ని "బాంబే పాయింట్" అని పిలుస్తుంటారు.
ఫాక్‌లాండ్, కార్నాక్ పాయింట్ల దగ్గర నుంచి చూస్తే కింద ఉన్న లోయలోని దృశ్యాలు ఒక్కొక్కచోట ఒక్కో రీతిలో కనిపిస్తాయి. ఈ పాయింట్ల ఎదురుగా ఉండే కొండల మధ్యలోంచి క్షణక్షణానికి పెద్దదవుతూ, ఎర్రగా కొండలలోకి జారిపోతూ ఎర్రటి కుంకుమ తిలకం దిద్దుకున్న...
"
విల్సన్ పాయింట్" అనే ప్రాంతం మహాబలేశ్వర్ మొత్తానికి అతి ఎత్తైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి సూర్యోదయ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూసేందుకు వీలుగా మూడు పెద్ద పెద్ద వేదికలను సైతం ఇక్కడ నిర్మించారు.ఇంకా... ఈ పాత మహాబలేస్వరంలో కృష్ణానదీమతల్లి జన్మస్థలం, రావణుడు పొంది... వినాయకుడు పోగొట్టుకున్నదిగా చెప్పడే "శివలింగాన్ని" కలిగి ఉన్న పరమశివుడి ఆలయం, కృష్ణానది పుట్టినచోట ఉండే కొండల వరుసకు కొంత దూరంలో ఉండే మరో కొండల వరుసలో జన్మించిన వెన్నానది.. లాంటి తప్పకుండా చూడదగ్గ ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు బోలెడన్ని ఉన్నాయి.పాత మహాబలేశ్వర్ నుంచి తిరుగు క్రమంలో మధ్యలో ఉన్న ఓ అడ్డరోడ్డు ద్వారా ముందుకెళ్తే... "ఆర్థర్ పాయింట్" అనే అద్భుతమైన ప్రాంతం చేరుకోవచ్చు. ఉదయం 11 గంటలలోపే ఇక్కడికి చేరుకున్నట్లయితే, అక్కడి అద్భుతమైన దృశ్య సౌందర్యాన్ని తనివితీరా వీక్షించవచ్చు.ఈ ప్రాంతంలో కొండ అంచు నుంచి బయటికి వేళ్లాడుతూ ఉండేటట్లుగా చెక్కలతో ఒక ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించారు. సుమారు 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఫ్లాట్‌ఫామ్ కింద కొన్న వందల అడుగుల లోతు ఉన్న లోయ ఉంటుంది. అందుకే దీన్ని సూసైడ్ పాయింట్ అని కూడా అంటుంటారు. ఇక ఈఫ్లాట్‌ఫాం నుంచి ఎదురుగా కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని చూస్తే మనసు లయ తప్పక మానదు."
సావిత్రి పాయింట్" అనే ప్రాంతం నుంచి చూస్తే... దూరంగా ఉన్న కొండ వరుసలలో ఒక కొండమీది నుంచి క్రింద ఉండే లోయదాకా తెల్లగా, మెరుస్తూ... ఒంపు సొంపుల వయ్యారాలతో ప్రవహించే సావిత్రి నదిని చూడవచ్చు. "హంటర్ పాయింట్" నుంచి మహాబలేశ్వర్ ఊర్లోకి వెళ్లకుండా, ఊరికి ఉత్తరంగా 2 కి.మీ. దూరంలో ఉన్న మరో రోడ్డు వెంబడి సరాసరి వెళితే "కేట్స్ పాయింట్"కు చేరుకోవచ్చు.
కేట్స్ పాయింట్‌కు దగ్గర్లోనే "రాస్‌మండ్ రాక్ పాయింట్" అనేది ఉంటుంది. కొండ అంచునే ఉండే ఈ ప్రాంతం నుంచి కింద ఉన్న కృష్ణానదీలోయ మరింత అద్భుతంగా కనిపిస్తుంది. కీట్స్ నుంచి వెనుదిరిగేటప్పుడు ఊర్లోకి వెళ్లకుండా, తూర్పుదిశలో మరో రోడ్డువెంబడి సుమారు 2. కి.మీ వెళ్తే పెన్నానదీ ప్రవాహమైన "లింగమల జలపాతం" చేరుకోవచ్చు.మహాబలేశ్వర్ ఊరికి ఆగ్నేయంగా మరో ఆరు పాయింట్లు చూడదగ్గవి. ఊరికి దగ్గరగా ఒక కి.మీ దూరంలో "హెలెన్ పాయింట్" ఉంటుంది. ఇక్కడి నుంచి చూస్తే కొండ దిగువగా ఉండే విశాలమైన లోయ, ఆ లోయలో పారుతుండే సొల్షినది, అక్కడక్కడా వివిధ ఆకారాలతో ఉండే కొండ శిఖరాలు మనోహరంగా అగుపిస్తాయి.విల్సన్ పాయింట్ తరువాత రెండో ఎత్తైన ప్రదేశమైన "బాబింగ్టన్" మహాబలేశ్వర్‌లోనే కలదు. ఇక్కడి నుంచి చూస్తే దిగువన ఉండే లోతైన లోయలు, కొయినా నదీ జలాల అందాలు, మధ్యమధ్యలో చిత్ర విచిత్రంగా కనిపించే కొండశిఖరాలు కనువిందు చేస్తుంటాయి. దానికి దగ్గర్లోని "చైనామేన్ జలపాతం" సౌందర్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.చైనామేన్ జలపాతం దగ్గర్నించి దక్షిణంగా ముందుకెళ్తే, "ఫాక్‌లాండ్ పాయింట్" అనే మరో అందమైన ప్రాంతానికి అటునుంచి "కార్నాక్ పాయింట్"కు చేరుకోవచ్చు. ఈ రెండు పాయింట్ల దగ్గర నుంచి చూస్తే కింద ఉన్న లోయలోని దృశ్యాలు ఒక్కొక్కచోట ఒక్కో రీతిలో కనిపిస్తాయి. ఈ పాయింట్ల ఎదురుగా ఉండే కొండల మధ్యలోంచి క్షణక్షణానికి పెద్దదవుతూ, ఎర్రగా కొండలలోకి జారిపోతూ ఎర్రటి కుంకుమ తిలకం దిద్దుకున్న సూర్యుడిని తనివితీరా చూడవచ్చు.ఎలా వెళ్లాలంటే... మహాబలేశ్వర్ అనే ఈ ప్రదేశం పడమటి కనుమల్లో భాగమై ఉంటుంది. మహారాష్ట్రకు దక్షిణంగా ఉన్న కొల్హాపూర్ వైపు నుంచి వెళ్లేవారు.. సాతారా రైల్వేస్టేషన్‌లో దిగి, సాతారా నుంచి బస్సులో మహాబలేశ్వర్ చేరవచ్చు. సాతారా నుంచి మహాబలేశ్వర్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.సాతారాకు ఉత్తరంగా 32 కిలోమీటర్ల దూరంలో "వాయి" అనే ఊరు ఉంటుంది. సాతారా నుంచి వాయి మీదుగా 65 కి.మీ. దూరం వెళ్తే మహాబలేశ్వర్ చేరవచ్చు. సాతారా నుంచి పూణే వరకూ ఉన్న రైలు మార్గంలో వాతార్ అనే ఊరు ఉంటుంది. ఎవరైనా రైల్లో వెళ్లి వాతార్ స్టేషన్‌లో దిగదలచుకుంటే, అక్కడినుంచి మహాబలేశ్వర్ 62 కి.మీ. దూరంలో ఉంటుంది.ఇక పూణేవైపు నుంచి మహాబలేశ్వర్ వెళ్లేవారికి అక్కడి నుంచి మహాబలేశ్వర్‌కు సరాసరి బస్సులు కూడా ఉన్నాయి. అయితే ఇవి గంటకు 30 లేక 35 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. వేగంగా వెళ్లకపోయినా ఫర్వాలేదు అనుకునేవారు ఈ బస్సు ప్రయాణం చేయవచ్చు, లేదంటే రైలు ప్రయాణమే శ్రేయస్కరం...!