Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ లేని ఏడాది పాలనలో... ఆంధ్ర రాజకీయాలు

వైఎస్ లేని ఏడాది పాలనలో... ఆంధ్ర రాజకీయాలు
WD
అపర భగీరథునిగా, పేదలపాలిట పెన్నిధిగా, రైతుజన బాంధవునిగా జన హృదయాలలో నిలిచిపోయిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన రాష్ట్రాన్ని వీడి ఏడాది గడిచింది. అయినా ఆయన జ్ఞాపకాలను మాత్రం ప్రజలు వీడలేకపోతున్నారు. ఆయన లేని లోటును తీర్చే శక్తి ఏ నాయకునికీ లేదంటే వైఎస్సార్ ప్రజల హృదయానికి ఎంత చేరువయ్యారో అర్థమవుతుంది.

ఆయన గతించిన రెండు నెలలకే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పుట్టింది. ఆ వెంటనే సమైక్యాంధ్ర ఉద్భవించింది. ఎందరో విద్యార్థులు తమ ప్రాణాలను బలి పెట్టారు. తీరని శోకం మిగిల్చారు. మరోవైపు ప్రకృతి ప్రకోపించింది. అభివృద్ధిలో అగ్రపథాన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా అధఃపాతాళానికి దిగజారింది.

అన్నిటినీ ఒక దారిలో నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నా వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది ఈ ఏడాది కాలంలో. అటువంటి జనరంజక పాలనను అందించే నేతను కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిలోనూ చూడలేకపోతోందంటే ఆయన శక్తి ఎంతటితో అర్థమవుతుంది.

గత ఏడాది సెప్టెంబరు 2న వైఎస్సార్ ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌తో సహా ఇద్దరు పైలెట్లు కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగి రాని లోకాలకెళ్లారు. ఆయన మరణం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టించింది. పదవిలో ఉన్నప్పుడే ఓ ప్రమాదంలో మరణించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్సార్. తన హయాంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు. అయితే అధికారం చేపట్టి నాలుగు నెలలు కూడా తిరగక ముందే మరణించడం ప్రజలను శోక సముద్రంలో ముంచింది.

ఈ దశలో సీనియర్ నాయకుడుగా, ఆర్థికవేత్తగా పేరుగాంచిన రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్గానికి రుచించలేదు. తండ్రి వారసత్వంగా ఆయన కుమారునికే ముఖ్యమంత్రి పదవి దక్కాలని స్వయంగా సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామంతో అధిష్టానం నివ్వెరపోయింది.

ఇదిలావుండగానే జగన్ సొంత పార్టీ పాలనను మెల్లగా తూర్పార బట్టడం మొదలుపెట్టారు. వైఎస్ పథకాలు అమలు తీరుపై ధ్వజమెత్తారు. త్వరలో స్వర్ణయుగం వస్తుందని పరోక్షంగా రోశయ్య సర్కారుకు పొగ పెట్టారు. అలా వైఎస్ వర్గం, రోశయ్య వర్గంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. కాకపోతే పార్టీలోనే ఉంటూ హైకమాండ్ మాటను ధిక్కరిస్తూ ముందుకు వెళుతోంది జగన్ వర్గం.

తన తండ్రి మరణ వార్త విని తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చాలన్న ధ్యేయంతో జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర వివాదాస్పదమైంది. ఈ ఓదార్పులో కుటుంబాలను ఓదార్చే విషయం ఎలాగున్నా, జగన్ తన స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది.

పార్టీని, అధిష్టానాన్ని ఖాతరు చేయకుండా తన తండ్రి తన ఆస్తేననీ, ఆయన సాధించి తెచ్చిన సీఎం పదవీ తనకే కావాలన్న రీతిలో జగన్ ప్రవర్తన ఉంటోందని పలువురు సీనియర్ నాయకులు అధిష్టానం దృష్టికి పదేపదే తీసుకవెళ్లారు. దీతో కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను పిలిచి ఓదార్పును వాయిదా వేసుకోవలసిందిగా సూచన చేసింది. అధిష్టానం మాటలను పట్టించుకోని జగన్ ఓ బహిరంగ లేఖ రాసి ఉత్తరాంధ్ర ఓదార్పుకు బయలుదేరారు.

మొన్నటివరకూ ఏమీ పట్టనట్లు ఉన్న అధిష్టానం జగన్ వైఖరిపై దృష్టి సారించి రంగంలోకి దిగింది. వైఎస్ మరణవార్త విని తట్టుకోలేక తనువు చాలించిన వ్యక్తుల కుటుంబాలను తాము ఓదార్చుతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సాయం లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఓదార్పు అంటే డబ్బు ఇవ్వడమే కాదనీ, కన్నీళ్లు తుడవడమని అధిష్టానానికి పాఠాలు చెప్పారు జగన్.

ఇవన్నీ ఇలావుంటే తెలంగాణా సమస్యను తెరాస నిత్యం రగిల్చుతూనే ఉంటోంది. రాష్ట్రంలో ఏమూల ఏ చిన్న అవకతవక జరిగినా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అక్కడ ప్రత్యక్షమై అధికార పక్షాన్ని తూర్పారబడుతున్నారు. ఇక పీఆర్పీ స్నేహంగా ఉంటున్నా అంటూనే వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇలా ఏ పార్టీకాపార్టీ ముఖ్యమంత్రి రోశయ్య కంటిపై కునుకులేకుండా చేస్తున్నారు.

వీరందరూ ఒక ఎత్తైతే వైఎస్ జగన్ ఓదార్పు రోశయ్యకు పెద్ద తలనొప్పిగా మారింది. తనపై ప్రత్యక్షంగా మాటల యుద్ధాన్ని చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా అంతా అధిష్టానమే చూసుకుంటుందని ఓర్పుగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు రాజకీయ కురువృద్ధుడు ముఖ్యమంత్రి రోశయ్య.

మొత్తమ్మీద వైఎస్సార్ లేని ఏడాది కాలం అనేక అల్లర్లు, ఎన్నో రాజకీయ ఎత్తులు, మరెన్నో అవినీతి కుంభకోణాలతో సాగింది. మరి నెక్ట్స్ ఏంటో...?

Share this Story:

Follow Webdunia telugu