Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"సూపర్ సన్ డే": భారత్‌కు ఏకంగా 15 పతకాలు!

FILE
కామన్వెల్త్ గేమ్స్ క్రీడాపోటీల్లో భారత క్రీడాకారులు విజృంభిస్తున్నారు. వివిధ విభాగాల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్న భారత క్రీడాకారులు ఆదివారం మాత్రం ఏకంగా 15 పతకాలను సంపాదించిపెట్టారు.

కామన్వెల్త్ గేమ్సే ఏడో రోజైన సూపర్ సన్ డే భారత్ ఖాతాలో ఐదు స్వర్ణ పతకాలను, ఐదు రజత పతకాలను, మరో ఐదు కాంస్య పతకాలను సాధించి పెట్టారు. దీంతో భారత్‌కు మొత్తం 73 (29 స్వర్ణ, 22 రజత, 22 కాంస్య) పతకాలతో పాటు పాయింట్ల పట్టికలో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది.

మహిళల రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత ఈవెంట్‌లో టీనేజర్ దీపికా కుమారి (17) ఇంగ్లాండ్‌కు చెందిన ఒలింపిక్ మెడలిస్టు విలియమ్‌సన్ ఆలిసన్ జేన్‌ను 6-0 తేడాతో చిత్తుచేసి భారత్‌కు ఆదివారం నాడు తొలి స్వర్ణ పతకాన్ని అందజేయడంతోపాటు తన ఖాతాలో మరో పసిడి పతకాన్ని జమచేసుకుంది. కాగా, ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మరో ఆర్చర్ డోలా బెనర్జీ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

మరోవైపు పురుషుల ఆర్చరీ రికర్స్ సింగిల్స్ ఈవెంట్‌లో రాహుల్ బెనర్జీ మరో పసిడి పతకం సాధించాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ రౌండ్‌లో బెనర్జీ కెనడా ఆర్చర్ జాసన్ లియోన్‌ను 5-1 తేడాతో చిత్తుచేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, ఇదే విభాగంలో తృతీయ స్థానం కోసం జరిగిన పోటీలో భారత ఆర్చర్ జయంత్ తాలూక్‌దార్ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ గ్రేన మట్టికరిపించి, కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

అంతకుముందు పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత షూటింగ్ ఈవెంట్‌లో భారత షూటర్ హర్‌ప్రీత్ సింగ్ విజేతగా నిలిచి భారత్‌కు 26వ పసిడి పతకాన్ని అందించాడు. ఇంకా పురుషుల సింగిల్స్ ట్రాప్ ఈవెంట్‌లో భారత షూటర్ మానవ్‌జీత్ సింగ్ సంధూ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే సుశీల్ కుమార్ 66 కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించాడు.

ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 66 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ బౌట్‌లో సుశీల్ కుమార్ దక్షిణాఫ్రికాకు చెందిన మల్లయోధుడు హెన్రిచ్ బార్నెస్‌ను కేవలం రెండు రౌండ్లలోనే మట్టికరిపించాడు. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ బౌట్‌లో సుశీల్ కుమార్ ధాటికి హెన్రిచ్ 2-0, 5-0 తేడాతో చిత్తయ్యాడు.

ఇంకా అథ్లెటిక్స్ విభాగంలో మహిళల లాంగ్ జంప్ ప్రజ్యూష ద్వితీయస్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. రుషుల (120 కిలోలు) ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో భారత మల్లయోధుడు జోగిందర్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu