Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి మహిళా ఐపీఎస్ అధికారి.. కిరణ్ బేడి

Advertiesment
తొలి మహిళా ఐఎపీస్ అధికారి కిరణ్ బేడి చరిత్రలో స్ఫూర్తి
, మంగళవారం, 8 జనవరి 2008 (16:32 IST)
FileFILE
భారత చరిత్రలో తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టి, మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచి... పోలీసు శాఖకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన భారతవనిత కిరణ్ బేడి. సమాజంలో సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన బేడి... 1949, జూన్ 9న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు.

ఆమె తల్లిదండ్రులు బేడి ప్రకాష్ లాల్ పేష్వారియా, ప్రేమ్ లతా పేష్వారియాలు. కిరణ్ ద్వితీయసంతానం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమృత్‌సర్‌లోనే ఆర్ట్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువులను పంజాబ్ యూనివర్శిటీలో పూర్తి చేశారు.

అప్పుడే భారత పోలీసు శాఖపై ఆమె దృష్టి సారించారు. దీని కోసం ఆమె ఢిల్లీ యూనివర్శిటీలో ఎల్ఎల్‌బీ చేశారు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే ఆమెలోని అత్యున్నత ప్రతిభకు యూనివర్శిటీ పురస్కారంతో సత్కరించింది. అప్పట్లోనే మాదకద్రవ్యాలను నిరోధించటం, గృహహింసకు అడ్డుకట్టవేయటం వంటి వాటిపై సిద్ధాంతీకరించి.. పరిశోధన వ్యాసం చేయడం గమనార్హం.

క్రీడలలోను ఆమె ముందడుగే... తన 22 ఏళ్ల వయసులోనే మహిళా విభాగంలో ఆఖిల భారత ఆసియా టెన్నిస్ ఛాంపియన్‌‌గా టైటిల్ కప్ గెలుచుకున్నారు. 1970-72ల మధ్య అమృత్‌సర్‌లోని ఖాల్సా మహిళా కళాశాలకు రాజనీతిశాస్త్రంలో లెక్చెరర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 1972లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీసుకు తొలి పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణురాలై ఐపీఎస్‌కు ఎంపికై అందరినీ అబ్బురపరిచారు.

కిరణ్ బేడి కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ శాంతి భద్రతా విభాగానికి పోలీసు సలహాదారుగా బాధ్యతలను నిర్వహించడం.. సంస్థకు ఆమె చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి అవార్డుతో గౌరవించింది.

చివరగా ఆమె పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. తన జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఈ డైరెక్టర్ జనరల్ బాధ్యతకు ముందస్తు రాజీనామా చేయగా.. ప్రభుత్వం ఆమె రాజీనామాను స్వీకరించింది.

ఆమె తన బాధ్యతలు నిర్వహించడంలో ఏమాత్రం లోపాలున్నా సహించేది కాదు. మృదు స్వభావే అయినా దోషులను శిక్షించడంలో కఠినత్వం కాళికాదేవిని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. పోలీసు శాఖలో ఉన్నప్పుడు ఆమె ప్రముఖులకు సలహాదారుగా కూడా పనిచేశారు.

దేశ అంతర్గత భద్రతలోను ఆమె సలహాలే నేటికి అనుసరిస్తుండటం గమనార్హం. ఎంతోమంది ఖైదీలకు జీవితంలోని మాధుర్యాన్ని తెలిపి మంచివారుగా తీర్చి దిద్దారు. పోలీసు కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను.. విమర్శలను... ఆరోపణలను ఎదుర్కొన్నా.. దేశంలో సమానత్వం కోసం తనవంతు కృషి చేయడానికి పెద్ద పీఠ వేస్తానని ఆమె నిరాడంబరంగా చెబుతారు..

Share this Story:

Follow Webdunia telugu