భారత సంతతి కెనడియన్ సినిమా దర్శకురాలు దీపా మెహతాకు వాషింగ్టన్‌లోని లయోలా మేరీమౌంట్ యూనివర్శిటీ జీవిత కాల సాధన అవార్డ్‌ను బహుకరించనుంది. ఈ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ పిల్మ్ అండ్ టెలివిజన్ విభాగం తన ఫిల్మ్ అవుట్‌సైడ్‌ది ఫ్రేమ్ ఉత్సవాల సందర్భంగా దీపామెహతాకు అక్టోబర్ 13న ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ స్టోరీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును బహుకరిస్తున్నట్లుగా ప్రముఖ ఆంగ్ల పత్రిక వెరైటీ పేర్కొంది. ఈ ఉత్సవాల్లోనే కాస్‌గ్రోవ్ డిస్టింగ్విష్‌డ్ విజిటింగ్ ఆర్టిస్ట్‌గా ఆమెకు అవార్డు సమర్పించనున్నారు.
దీపామెహతా తాజాగా నిర్మించిన హెవెన్ ఆన్ ఎర్త్ - భూమ్మీద స్వర్గం- సినిమా వలస ప్రజల ఇబ్బందులు, ఒంటరితనం, ఊహాశక్తి వంటి సమస్యలను హృదయాలను కదిలించే రీతిలో చూపించింది. ఈ సినిమా టొరోంటో ఫిలిం ఫెస్టివల్‌లో ఇటీవలే ప్రదర్శించబడింది.
తన తాజా చిత్రం హెవెన్ ఆప్ ఎర్త్‌ను పంజాబీ భాషలో తీయడం వల్ల ఎలాంటి అవరోధాలు ఎదురుకావని దీపామెహతా ఈ సందర్భంగా చెప్పారు. గృహహింస విశ్వవ్యాపితంగా చలామణీలో ఉన్నందున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు దానికి ప్రతిస్పందించగలరని దీమా చెప్పారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా టొరోంటో చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారని దీపా పేర్కొన్నారు.
కెనడాలోని వలస ప్రజల కమ్యూనిటీలో సాగుతున్న గృహహింస గురించి ఈ సినిమా చిత్రించిందని, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతీ జింటా దీనిలో ప్రధాన పాత్ర వహించిందని దీపా మెహతా చెప్పారు. హిందీ, ఇంగ్లీష్‌లాగే పంజాబీ కూడా భారతీయ భాషేనని దీపా సమర్థించుకున్నారు. నిర్మాత బలవంతం కారణంగా ఈ సినిమాను హిందీలో కొన్ని చోట్ల డబ్ చేయవలసి వచ్చింది కానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎలాంటి దురభిప్రాయాలు లేకుండా పంజాబీ వెర్షన్‌ను ఆస్వాదించగలరని దీపా ఆశాభావం వ్యక్తం చేశారు.