Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిఎన్ఎ మ్యాపింగ్ పూర్తయిన తొలి మహిళ

Advertiesment
డిఎన్ఎ మ్యాపింగ్ పూర్తయిన తొలి మహిళ

Raju

, గురువారం, 19 జూన్ 2008 (18:17 IST)
జన్యుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న డచ్ మహిళా జీవశాస్త్రవేత్త తన డిఎన్ఎను పూర్తిగా మ్యాపింగ్ చేసుకుని రికార్డు సృష్టించారు. పదేళ్ల ముందునాటితో పోలిస్తే డిఎన్ఎ మ్యాపింగ్ సామగ్రి, టెక్నిక్‌లు ప్రస్తుతం వేగవంతంగాను, చౌకగాను ఉండటంతో 34 ఏళ్ల నెదర్లాండ్స్ మహిళ మార్జోలెనిన్ క్రీక్ ప్రపంచ చరిత్రలో డిఎన్ఎ మ్యాపింగ్ పూర్తయిన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు.

అంతేకాక మానవ చరిత్రలో శాస్త్రీయ అధ్యయనం కోసం తమ జన్యు సమాచారాన్ని క్రోడీకరించుకున్న అయిదవ వ్యక్తిగా కూడా మార్జోలెనిన్ క్రీక్ నమోదయ్యారు. హ్యూమన్ జెనోమ్‌ మ్యాపింగ్‌లో మహిళలు కూడా పాలుపంచుకోవడానికి ఇదే సరైన సమయం అంటూ ఆమె ప్రకటించడం విశేషం.

గత పదేళ్లుగా హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టు నడుస్తున్నప్పటికీ ఏ ఒక్కరికీ మహిళల జన్యు సమాచారాన్ని క్రోడీకరించాలనే ఆలోచన లేకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రీక్ చెప్పారు. మొదటగా మనం దీన్ని చేయగలం అని తమకు తట్టిందని, తర్వాత దీన్ని మనం చేయగలిగితే మహిళతోటే మనం చేయగలమని ధృవపర్చుకున్నామని చెప్పారామె.

క్రీక్ జెనోమ్‌ను క్రోడీకరించడానికి నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ పరిశోధనా బృందానికి 9 నెలల సమయం పట్టింది. దీనికి గాను వారికి 62 వేల అమెరికన డాలర్ల ఖర్చయింది. 2001లో అమెరికన్ ప్రభుత్వం మొట్టమొదటి మానవ జన్యుక్రమాన్ని క్రోడీకరించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో తొలి హ్యూమన్ జెనోమ్ క్రోడీకరణకు వారికి 300 మిలియన్ డాలర్లు వ్యయం కాగా, అయిదేళ్ల సమయం తీసుకున్నారు.

అధునాతన జన్యు క్రోడీకరణ యంత్రాలు మానవ జన్యు క్రోడీకరణను మరింత వేగవంతంగా, మరింత చౌకగా పూర్తిచేయగలిగేందుకు పరిశోధకులకు అవకాశమిస్తున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో ఓ అమెరికన్ కంపెనీ ఇప్పుడున్న వాటికంటే శరవేగంతో పనిచేయగల జన్యు క్రోడీకరణ సామగ్రిని తయారుచేసినట్లు ప్రకటించింది. ఈ అధునాతన సామగ్రితో కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో వెయ్యి డాలర్ల వ్యయంతో జన్యుక్రమాన్ని క్రోడీకరించవచ్చని ఆ కంపెనీ తెలిపింది.

ఈ క్రమంలో క్రీక్ డిఎన్ఎ క్రమాలను క్రోడీకరించిన పరిశోధకులు ఖచ్చితమైన ప్రతిని పొందటానికి పలుసార్లు ఆమె జన్యుక్రమాన్ని మ్యాప్ చేశారు. ఆరు నెలల తర్వాత క్రీక్ డిఎన్ఎ క్రోడీకరణ క్రమం ఇతర శాస్త్రవేత్తల పరిశీలన కోసం ప్రచురించనున్నామని లీడెన్ యూనివర్శిటీ మెడికల్ కేంద్రం పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu