Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభాలు కలిగించే "పత్రాల పూజ"...!

శుభాలు కలిగించే
వినాయక చవితి నాడు చేసే పూజలో కీలకమైనది 21 పత్రాలతో చేసే పూజ. ఈ పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఈ పూజలో ముఖ్యమైనది గరిక. గరిక అంటే స్వామి వారికి ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. దీనిని దూర్వా పత్రమని అంటారు. ఇందులో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలు ఉంటాయి. తర్వాతది మాచీ పత్రం అంటే చేమంతి జాతికి చెందిన ఆకులు. ఈ ఆకులు సువాసన భరితంగా ఉంటాయి.

తర్వాతి పత్రం అపామార్గ పత్రాలు. ఇవి గుండ్రంగా ఉంటాయి. దీనినే తెలుగులో ఉత్తరేణి అని అంటారు. వీటితో పాటు బృహతీ పత్రం, దీన్నే ములక అని అంటారు. వీటిలో చిన్న ములక, పెద్ద ములకలు అని రెండు రకాలు ఉన్నాయి. దుత్తూర పత్రం, అంటే ఉమ్మెత్త ఆకులు. వంకాయ జాతికి చెందిన చెట్లు ఇవి. తులసీ పత్రం, ఈ పత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేదీ ఏమీ లేదు. దేవతార్చనలో వాడే ఈ పత్రాలు మంగళదాయకమైనవి.

శమీపత్రం, జమ్మి చెట్టు ఆకులను శమీపత్రాలు అంటారు. దసరా సమయంలో ఈ చెట్టుకు భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. మరువక పత్రం, వీటినే ధవనం, మరువం అని కూడా అంటారు. పూల మాలల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. కరవీర పత్రం, ఈ పత్రాలను గన్నేరు పత్రాలని కూడా అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు ఇలా వివిధ రంగుల్లో ఈ పూలు ఉంటాయి.

బిల్వ పత్రం, ఈ పత్రాలను మారెడు దళాలని అంటారు. మూడు ఆకులు కలిసి ఉండే దీనిని దళం అంటారు. వీటితో శివుడిని పూజిస్తే చాలా మంచిది. చూత పత్రం, ఇవే మామిడి ఆకులు. బదరీ పత్రం, బదరీ అంటే రేగాకులు. రేగి కాయ చెట్టుకు ఉండే ఆకులు ఇవి. వీటిలో రేగు, జిట్రేగు, గంగిరేగు అని మూడు రకాలు ఉంటాయి. గుండ్రంగా ఉండే ఆకులను పూజకు ఉపయోగించాలి.

విష్ణుక్రాంత పత్రం, తెలుపు, నీలం రంగు పువ్వులుండే చెట్లు ఇవి. నీలం రంగు పువ్వులు ఉండే చెట్టును విష్ణుక్రాంత చెట్టుగా పిలుస్తారు. సింధువార పత్రం, దీన్నే వావిలి అని కూడా పిలుస్తుంటారు. అశ్వత్థ పత్రం, ఇవే రావి ఆకులు. దాడిమీ పత్రం దాడిమీ అంటే దానిమ్మ. దానిమ్మ ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు. జాజి పత్రం, ఇవి మల్లి జాతికి చెందిన ఓ రకమైన మొక్కలు.

అర్క పత్రం, ఇవే జిల్లేడు ఆకులు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు, పచ్చ జిల్లేడు. వీటిలో ఏవైనా పూజకు శ్రేష్టమైనవే. అర్జున పత్రం, మద్ది చెట్టు ఆకులను అర్జున పత్రం అంటారు. మర్రి ఆకుల వలె ఇవి ఉంటాయి. దేవదారు పత్రం, దేవతలకు ఈ పత్రం అంటే చాలా ఇష్టం. ఇవి సన్నగా గడ్డిలా ఉంటాయి. గండలీ పత్రం, దీనినే లతాదూర్వా అని కూడా అంటారు. భూమిపైన తీగలాగా ఆ చెట్టు పెరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu