Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొజ్జ గణపయ్య... చిన్నారి చింటూ..!

బొజ్జ గణపయ్య... చిన్నారి చింటూ..!

Ganesh

, మంగళవారం, 2 సెప్టెంబరు 2008 (17:50 IST)
FileFILE
వక్త్రతుండ మహాకాయ
కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవా
సర్వకార్యేషు సర్వదా...!

అంటూ.. కళ్లు మూసుకుని తన్మయత్వంతో బొజ్జ గణపయ్యను ప్రార్థిస్తున్నాడు చింటూ... చిన్నవాడైనప్పటికీ ఎంతో భక్తితో ప్రార్థిస్తున్న చింటూను ఆప్యాయంగా చూశాడు గణపయ్య.

ఇంతకీ ఈ చిన్నారి భక్తుడి కోరికేంటో విందామనుకుని ఆవైపు చెవులు సారించాడు గణపయ్య.

"ఓ స్వామీ....! నన్నీ కష్టాల లోంచి బయటపడేస్తావన్న ఆశతో వేడుకుంటున్నాను."

ఇంత చిన్న పిల్లాడికి కష్టాలేంటబ్బా అని ఆలోచనలో పడ్డాడు బొజ్జ గణపయ్య.

గణపయ్య ప్రశ్నను అర్థం చేసుకున్నాడో... ఏమోగానీ.... ఎందుకు లేవు స్వామీ అంటూ ఎదురు ప్రశ్నించాడు చింటూ...

ఏంటో చెప్పుమరి అన్నట్లుగా ఉన్నాయి... గణపయ్య చూపులు.

ఇంతలో తన కష్టాల పరంపరను చెప్పటం ప్రారంభించాడు చింటూ...

తెలిసీ తెలియని వయసు నుంచే చదువు కోసం మేము పడే పాట్లు నీకు తెలియదా స్వామీ...! ప్రీకేజీ, బేబీ క్లాసులంటూ చిన్నారి బాల్యాన్ని స్వేచ్ఛగా అనుభవించనీయకుండా చేస్తున్నారు ఈ పెద్దాళ్ళు. ఇది మీకు కష్టంగా అనిపించటం లేదా...?

తరువాత స్కూళ్లకు వెళ్లే వయస్సులోనే... మోయలేని పుస్తకాల భారంతో అవస్థలు పడుతున్న మావి కష్టాల లాగా కనిపించటం లేదా...? చివరకు వేసవి సెలవుల్లో, పండుగలప్పుడు కూడా స్వేచ్ఛగా ఆడుకోనీయక హోం వర్క్ రాయమంటూ పెద్దలు దండించటం కష్టం కాదా...?

ఇంకా మాకు బోలెడన్ని కష్టాలున్నాయి. హాయిగా నిద్రపోనీయకుండా పొద్దున్నే, సాయంత్రం ట్యూషన్లు, ఆ తరువాత స్కూళ్లు, మళ్లీ స్పెషల్ క్లాసులు, స్పెషల్ కోర్సులు ఒకటా, రెండా.... చెప్పుకుంటే అన్నీ కష్టాలే స్వామీ...! చెప్పటం ఆపి గణపయ్య వైపు చూస్తున్నాడు చింటూ..!

చిన్నారి కష్టాలన్నింటినీ ఓపిగ్గా విన్న గణపయ్యకు... పెద్దవాళ్లైన తన భక్తులపై విపరీతంగా కోపం వచ్చింది. ఉండు నాయనా...! నువ్వేమీ బాధపడకు అన్నింటికీ నేనున్నాను. పెద్దవాళ్లంతా ఏ శుభకార్యం నిర్వహించాలన్నా... నా దగ్గరికి వస్తారు కదా...! అప్పుడు వాళ్ళందరికీ తెలియజెప్తాను అన్నట్లుగా... మెడలో ఉన్న హారంలోంచి ఓ పువ్వును చింటూ చేతుల్లో పడేలాగా చేశాడు గణపయ్య.

పువ్వు ఎందుకు పడిందో అర్థంకాని చింటూ... ఏమైతేనేం... దేవుడికి తన కష్టాలన్నింటినీ, తన తోటి పిల్లలందరీ కష్టాలన్నింటినీ చెప్పేశాను. పార్వతీ మాతకు ముద్దుల కొడుకైన గణపయ్య తన కోరికలను తప్పకుండా తీరుస్తాడన్న ఆశతో... సంతోషంగా ఆడుకునేందుకు వీధిలోకి పరిగెత్తాడు చింటూ...!

Share this Story:

Follow Webdunia telugu