Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'లవ్‌'లీ స్టార్స్... జాలీ కపుల్స్

'లవ్‌'లీ స్టార్స్... జాలీ కపుల్స్

WD

వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ తారల ప్రేమ వివాహాలను, అందుకు దారితీసిన పరిణామాలను చూచాయగా తెలుసుకుందాం. ప్రథమంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలల ప్రేమవివాహాన్ని ప్రస్తావించుకోవాలి. 1967 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో విడుదలైన 'సాక్షి' చిత్రంలో వీరిరువురు కలిసి నటించారు. ఆ చిత్ర కథను అనుసరించి వారిరువురి వివాహం ఓ దేవాలయంలో జరుగుతుంది. దీనిని గమనించిన హాస్యనటుడు రాజబాబు ఈ గుడిలో సినిమా పెళ్లి చేసుకున్నప్పటికీ నిజజీవితంలో దంపతులు అవుతారని సెలవిచ్చారు.

రాజబాబు మాట ప్రభావమో లేక దేవాలయ మహత్మ్యమో తెలియదు కాని కృష్ణ, విజయనిర్మలలు కొద్ది కాలానికే వివాహం చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నూతన అధ్యాయాలకు శ్రీకారం చుడుతూ వైవిధ్యభరితమైన సినిమాలతో నటశేఖర కృష్ణ స్టార్‌డమ్‌కు చేరుకోగా, అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా విజయనిర్మల గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు.

మూవీ మొఘల్ రామానాయుడు రూపొందించిన 'చినబాబు' చిత్రంలో నాగార్జున, అమలలు తొలిసారిగా కలిసి నటించారు. తరువాత నటించిన 'కిరాయి దాదా' చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన 'శివ' చిత్రంతో ప్రేమ పరిపక్వతకు చేరుకుంది. 'ప్రేమ యుద్ధం' చిత్రం విడుదలైన కొద్దికాలానికే నాగార్జున అమలలు వివాహం చేసుకున్నారు.

తమిళ చిత్రాలతో తెరంగేట్రం చేసిన రాజశేఖర్, జీవితలు 'తలంబ్రాలు' చిత్రంలో తొలిసారిగా కలిసి నటించారు. తలంబ్రాలు సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత వారిరువురు కలిసి నటించిన 'ఆహుతి', 'ఇంద్రధనస్సు', 'అంకుశం', 'మగాడు' చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 'తలంబ్రాలు' చిత్రీకరణ సమయంలో వీరిరువురు ప్రేమలో పడ్డారు. అయితే వీరి ప్రేమను పెళ్లి పట్టాలపై చేర్చేందుకు అవసరమైన గ్రీన్ సిగ్నల్‌ను ఇచ్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలు తొలుత తటపటాయించారు. 'మగాడు' సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్‌కు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆసుపత్రిలో ఆయనకు జీవిత చేసిన సపర్యలు ఇరు కుటుంబాల పెద్దలను ఆకట్టుకున్నాయి. దాంతో రాజశేఖర్, జీవితలు ఒక ఇంటివారయ్యారు.

ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన 'ఆమె' చిత్రంలో శ్రీకాంత్,ఊహలు తొలిసారిగా కలిసి నటించారు. ఆమె చిత్రం సూపర్ హిట్ కావడంతో ఇద్దరికి మంచి అవకాశాలు రాసాగాయి. 'ఆయనగారు' చిత్రంలో నటించే సమయానికి శ్రీకాంత్ పంపిన ప్రేమ సంకేతాలకు ఊహ ఓకే అనడంతో శ్రీకాంత్, ఊహల కళ్యాణం జరిగింది. 'పోలీస్' చిత్రంతో యాంగ్రీ హీరోగా వినుతికెక్కిన శ్రీహరి, కారెక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ భార్య సోదరి, సినీ నృత్య కళాకారిణి 'డిస్కో' శాంతిని ప్రేమించి, పెద్దల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు.

2000 సంవత్సరంలో విడుదలైన 'వంశీ' చిత్రంలో నటించడం ద్వారా మహేష్ బాబు, నమ్రతా శిరోడ్కర్‌లు ప్రేమలో పడ్డారు. అయిదేళ్లపాటు ప్రేమించుకున్న అనంతరం 2005 ఫిబ్రవరి మాసంలో వివాహం చేసుకున్నారు. 'అల్లుడు గారు' చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న అందాల కథానాయిక రమ్యకృష్ణ, వెరైటీ చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో 'చంద్రలేఖ' చిత్రంలో నటించారు. చంద్రలేఖ చిత్ర నిర్మాణ సమయంలో ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. అనంతరం రమ్యకృష్ణ, కృష్ణవంశీల వివాహం హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగింది. వివాహం అనంతరం కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'శ్రీ ఆంజనేయం' చిత్రంలో రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణ నుంచి నటనను మాత్రమే వారసత్వంగా పుచ్చుకోక ప్రేమ వారసత్వానికి గుర్తుగా నమ్రతను మహేష్ బాబు పరిణయమాడటం ఈ వ్యాసానికి కొసమెరుపు.

Share this Story:

Follow Webdunia telugu