Bhartha mahashayulaku vijanpti
నటీనటులు : రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్, సునీల్, తారక్ పొన్నప్ప, సత్య, వెన్నెల కిశోర్ తదితరులు.
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : ప్రసాద్ మురెళ్ళ, సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, దర్శకుడు : కిషోర్ తిరుమల.
నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల ఈసారి మగవారిపై భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సంక్రాంతి సందర్భంగా నేడే థియేటర్లోకి వచ్చాడు. రవితేజతో చేసిన ఈ ప్రయోగంలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరి ఎలా వుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
రామ్ (రవితేజ) హైదరాబాద్‌లో వైన్ కంపెనీని తన భార్య బాలామణి (డింపుల్ హయాతి) పేరుమీద చేస్తుంటాడు. ఆమె భర్త పట్ల అపారమైన ప్రేమతోపాటు సెన్సిటివ్ మైండ్. రాముడులాంటివాడు తన భర్త అనుకుంటుంది. తన వైన్ కంపీనీని స్పెయిన్లో వుండే పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటే రెండు సార్లు రిజెక్ట్ అవుతుంది. దానితో అక్కడేదో జరుగుతుందని గ్రహించి స్నేహితుడు వెన్నెల కిశోర్‌తో కలిసి రామ్ స్పెయిన్ వెళతాడు. అక్కడ సినిమాటిక్ పరిణమాలతో వైన్ కంపెనీ ఓనర్ మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. తన డీల్ రిజెక్ట్‌కు కారకుడు ఆమె పి.ఎ. సత్య అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత రామ్ ఏం చేశాడు? అనంతరం జరిగిన సంఘటనలతో మానస ఏవిధంగా వైన్ డీల్‌ను అంగీకరించింది? దానివల్ల రామ్, మానస జీవితం ఎటువైపు మలుపు తిరిగింది? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
సినిమా టైటిల్ పెట్టినప్పుడే మగవారికి ఏదో సూచన చేస్తున్నట్లుగా తెలిసిందే. ట్రైలర్ విడుదలయ్యాక ఇద్దరు భామల మధ్య రవితేజ ఏవిధంగా ఇబ్బందులు పడ్డాడు అనేది దర్శకుడు రిలీవ్ చేశారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే ఓ మొగుడి కథతో సాగుతుంది. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే నేపథ్యం వేరుగా తీసుకుని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశాడు. దానికి వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రలుగా వున్నాయి.
కథలో రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. భార్యగా డింపుల్ హయాతి భర్తపై వల్లమాలిన అభిమానాన్ని చూపే పాత్ర పోషించింది. ఆషికా రంగనాథ్ విదేశాల్లో కల్చర్‌కు అలవాటుపడిన పాత్రను పోషించింది. ఇద్దరు బాయ్ ప్రెండ్స్‌ను రిజెక్ట్ చేసిన ఆమె రామ్ పాత్రతో ఎలా కనెక్ట్ అయింది అనేది అసలు పాయింట్.
ఇక రవితేజ, వెన్నెల కిశోర్, సునీల్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కొన్ని చోట్ల నవ్వించాయి. సత్య, తన బాస్ మానసపై చూపే అతి మర్యాద సరికొత్తగా దర్శకుడు డీల్ చేశాడు. అజయ్ ఘోష్ పాత్ర కూడా సరికొత్తగా చూపించాడు. ఎంటర్టైన్ మెంట్ ప్లస్ యాక్షన్ సీన్స్ వుంటాయి. మొత్తంగా చూస్తే, భార్యకు తెలీకుండా మానసతో గడిపిన క్షణాలు దాచివేయడంతో ఏర్పడ్డ పరిస్థితులు ప్రేక్షకుడికి ఎంటర్టైన్ కలిగిస్తాయి. అదే టైంలో మానస నేరుగా రవితేజ ఆఫీస్‌కు ఇంటికి రావడం వల్ల రామ్ చేసే విన్యాసాలు వినోదాన్ని తెప్పిస్తాయి.
అయితే, కథ బాగానే ఉన్నా గత సినిమాల ఛాయలు కనిపిస్తాయి. అయినా రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి.. ఆ క్రమంలో దర్శకుడు కొన్ని రాసుకున్న సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడం, ఫోర్స్‌బుల్ కామెడీ సీక్వెన్స్ పెట్టినట్లు తెలిసిపోతోంది. ఇంటర్వెల్ కూడా రొటీన్ గానే వుంటుంది. మద్యలో బాలామణి సోదరి కొడుకుతో చేసే సన్నివేశాలు కూడా బాగున్నాయి.
సెకండ్ హాఫ్‌లో మరింత ఆసక్తికరంగా వుంటుందనుకుంటే ఫోర్స్‌డ్ సన్నివేశాలతో సినిమా సీరియల్‌గా అనిపిస్తుంది. అటు క్లైమాక్స్‌లో కూడా ఉత్సుకత మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. పాటలు బాగున్నా వాటి ప్లేస్ మెంట్ కూడా బాలేదు. పాట పడాలి కాబట్టి, వాంటెడ్‌గా సాంగ్‌కి లీడ్‌ను క్రియేట్ చేయడం సినిమా స్థాయికి తగ్గట్టు లేదు.
దర్శకుడు కిషోర్ తిరుమల తన టేకింగ్ బాగున్నా, కథనంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌లో ఇంకాస్త పదును పెట్టాల్సింది.
ప్రతి మనిషిలో రెండు కోణాలుంటాయి. ఒకరు రామ్ అయితే రెండోవాడు రెమోలా బిహేవ్ చేస్తాడు. కనుక రెమోని నొక్కిపెట్టి రామ్‌ను బయటకు తెచ్చుకుని ఏది కరెక్టో ఏది కాదో తెలుసుకుని జీవితాన్ని సాగించాలనే సందేశాన్ని దర్శకుడు ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశాడు. రవితేజ నటనతో పాటు కొన్ని కామెడీ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి.