విక్రమ్, అమీ జాక్సన్ నటించగా శంకర్ దర్శకత్వంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, పిసి శ్రీరాం కెమెరామన్‌గా రూపొందిన ఐ సినిమా భోగి పండుగ రోజైన బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
ఐ నటీనటులు : విక్రమ్, అమీజాక్సన్, సురేష్ గోపి, శరత్‌కుమార్ సంతానం తదితరులు; నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్, సహనిర్మాత: రమేష్ బాబు, దర్శకత్వం: శంకర్.
తమిళ దర్శకుడు శంకర్ సినిమా అంటేనే ఏదో ప్రత్యేకత వుంటుందని ప్రేక్షకులు ఊహిస్తారు. అయితే అపరిచితుడు నుంచి శివాజీ వరకు రకరకాల ప్రయోగాలు చేసిన శంకర్.. రెండేళ్ళపాటు నటుడు విక్రమ్‌ను భౌతికపరంగా చాలా మార్పులకు గురిచేశాడు. ఇది చాలా హాట్ టాపిక్‌గా మారింది. చివరికి చైనాలో కూడా 5 వేల థియేటర్లలో విడుదల కావడం కూడా అక్కడ బ్యాక్‌డ్రాపే అనేది కూడా ఆసక్తికరంగా వుంది. మరి ఆ ఆసక్తి ఎలా వుందో చూద్దాం.
కథ :
కథగా తీసుకుంటే చాలా సింపుల్ పాయింట్ అనే చెప్పాలి. లింగేశ్వర్ (విక్రమ్) మాస్ ఏరియాలో వుంటాడు. తండ్రి ఆర్నాల్డ్ జిమ్ నిర్వహిస్తుంటాడు. లింగేశ్వర్కు మిస్టర్ ఆంధ్ర నుంచి మిస్టర్ ఇండియాకు ఎదగాలనేది కోరిక. బాడీని బాగా పెంచి మిస్టర్ ఆంధ్ర పోటీకి వెళుతుండగా ఓ పోటీదారు అవమానించి తప్పుకోమంటాడు. ఆ తర్వాత జరిగిన గొడవతో లింగేశ్వర్‌పై పగ పెంచుకుంటాడు. లింగేశ్వర్ మిస్టర్ ఆంధ్రాగా ఎంపికవుతాడు. ఇక్కడ చెన్నై లోకల్ ప్రొడక్ట్‌కు మోడల్‌గా వుంటాడు.
మరోవైపు జాతీయస్థాయిలో అందమైన మోడల్‌గా వుండే దియాకు ప్రముఖ మోడల్ జాన్‌కు మధ్య ఏర్పడిన గొడవతో ఆమె లింగేశ్వర్‌ను లీ గా మార్చేసి మోడ్రన్ మోడల్‌గా తయారుచేస్తుంది. దియా అంటే వల్లమాలిన ప్రేమ. కాగా, మొట్టమొదటిసారిగా చైనాలో మోడలింగ్‌కు తీసుకెళుతుంది. అక్కడ నటనలో ఎమోషన్స్ పండించడం కోసం ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతుంది. దాంతో బాగా నటించి ప్రొడక్ట్‌కు క్రేజ్ తెస్తాడు. పాపులారిటీ పెరిగిపోతుంది.
ఇది సహించని జాన్.. లీపై చైనాలో ఎటాక్ ఇస్తాడు. దాన్నుంచి ఎలాగో తప్పించుకుంటాడు. ఆ తర్వాత దియా.. లీకు మరింత దగ్గరై నిజంగానే ప్రేమిస్తుంది. ఇద్దరూ జీవితాంతం తామూహించినట్లుగా అందమైన తోట, మధ్యలో ఇల్లులో వుండాలని ప్లాన్ చేస్తారు. కానీ అవి కలగానే వుండిపోతాయి. దానికి కారణం లీ కురూపిగా మారిపోవడమే. దీనికి కారణం ఎవరు? ఎందుకని అలా చేశారు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన కథ.
పెర్ఫార్మెన్స్...
నటనాపరంగా చియాన్ విక్రమ్‌ను అభినందించాల్సిందే. తమిళులు చియాన్ అనే బిరుదు ఎందుకు ఇచ్చారో ఈ సినిమాలో చూస్తే మరింత తెలుస్తుంది. మాస్ పాత్ర నుంచి మోడ్రన్ వరకు, కురూపిలో మూడు రకాల పాత్రలకు జీవం పోశాడు. దానికి తగినట్లు బాడీని తగ్గించుకోవడం చిత్రంలో ప్రత్యేకత. మనిషి మృగంగా కన్పించే పాత్ర కేవలం పాట కోసమే. వళ్లంతా బొబ్బల్తో కురూపిగా మారిన తర్వాత నుంచి పాత్రలో లీనమయ్యాడు.
ఎక్కడా విక్రమ్ కన్పించలేదు. దియాగా అమీజాక్సన్ మోడల్‌గా బాగానే చేసింది. ఆమె నటించడానికి పెద్దగా లేకపోయినా చిన్నపాటి ఎమోషన్స్ పండించింది. దేశంలో పెద్ద ప్రొడక్ట్స్ అధినేతగా అచ్చం కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను పోలినట్లు పాత్రగా ఒకతను చేశాడు. విక్రమ్‌కు చిన్నప్పటి స్నేహితుడిగా సంతానం నటించాడు. మేకప్‌మేన్ గే పాత్ర బాగా చేశాడు. ఇక మిగిలినవారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా...
టెక్నికల్‌గా కెమెరా నైపుణ్యంతోపాటు, విజువల్‌గా గ్రాఫిక్స్, డిఎ. ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇవన్నీ పాటలకు కొన్ని సన్నివేశాలకు ఉపయోగించారు. అయితే కురూపిగా రకరకాలుగా మార్చడానికి మేకప్‌మేన్ పాత్ర కీలకం. విదేశాలకు చెందిన వారు ఈ చిత్రానికి పనిచేశారు. కెమెరాతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా మాయా కంపెనీతో పాటు విదేశీ నిపుణులు పనితనం కన్పిస్తుంది. ఇక ఎఆర్ రెహమాన్ బాణీలంటే తెలిసిందే. మెలోడీ తరహాలో సాగే పాటలకు చక్కగా అల్లుతాడు. ముఖ్యంగా 'పరేశానయ్యా..' అనే పాట ట్యూన్ బాగుంది. మిగిలిన ట్యూన్ బాగున్నా పాటల్లో సాహిత్యం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది.
మాటల పరంగా శ్రీరామకృష్ణ.. తెలుగు నేటివిటీకి సరిపడా రాశాడు. హీరోయిన్లు బికినీ డ్రెస్ వేసుకుంటే రెండు గుడ్డ పీలికలు అనేది మామూలు పదం. ఇందులో ఇడ్లీ గుడ్డల్లా అనే పదాన్ని ఉపయోగించి నవ్వించాడు. ఇలా సంతానం పాత్రలో కొన్ని నవ్వులు వస్తాయి. విక్రమ్ యాక్షన్లోనూ నవ్వులు పూస్తాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓకే. స్క్రీన్‌ప్లే.. విషయంలో ముందు వెనక.. వెనక ముందు ఇలా తారుమారు చేసి ప్రేక్షకుడికి ఇంటర్వెల్ తర్వాత కూడా కథ అర్థం కాకుండా చేయడం శంకర్ స్టైల్.
విశ్లేషణ :
సాధారణ పాయింట్‌ను హైటెక్ ట్రీట్మెంట్ ఇవ్వడమే ఈ చిత్రంలోని ప్రత్యేకత. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి, అవినీతి, లంచగొండితనం వంటివి ఎన్నో అంశాలు టచ్ చేసిన శంకర్. ఈసారి.. మోడల్ రంగంలో ఒక సామాన్యుడు పోటీ వస్తే ఎలాంటి ఈర్ష్యద్వేషాలు కట్టలు తెంచుకుంటాయో అనేది చూపించాడు. అందుకు డాక్టర్ పాత్ర తోడయింది. ఫ్యామిలీ డాక్టర్ ఆ ఇంటి అమ్మాయిపై కన్నేసి... మరొకడికి దొరక్కుండా చేయడంలో సురేష్‌గోపీ పాత్ర.. హైసొటీ కల్చర్‌కు తార్కారణం. అసలు విలన్ డాక్టర్ అనేది చివరి వరకు తెలీకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు.
అయితే ఇందులో 'ఐ ఇన్ప్లూయన్స్ పెరసీ' అనే జనటిక్ ఇంక్షన్.. పేరుగా టైటిల్‌కు పెట్టడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్‌లో ప్రయోగాలు చేస్తున్నారంటూ చెబుతాడు. అందమైన వాడిని డైరెక్ట్‌గా చంపకుండా కురూపిగా మార్చి జీవశ్చవంలా చేయడమే దీని పని. ఇటువంటి కొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చి అందరికీ తెలిసేలా చేశాడు శంకర్.
లోకం.. అంతే. ఒకరు బాగుంటే చూడలేరు. అనేది ఓ డైలాగ్‌లో చెబుతాడు విక్రమ్. ఈ చిత్రానికి అదే పాయింట్. ఈ పాయింట్‌తో రకరకాల కథలు అల్లుకోవచ్చు. వచ్చాయి కూడా. శంకర్ చేసిన ప్రయత్నమే ఐ. కాసేపు సరదాగా, కాసేపు సీరియస్‌గా సాగే ఈ సినిమా రొటీన్ చిత్రాలకు భిన్నంగా కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఈ చిత్రం పండగ తర్వాత ఎలా వుంటుందో చూడాలి.