Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెడిసన్ ఒక తపస్సు..... డాక్టర్ ఒక "ఋషి"!

మెడిసన్ ఒక తపస్సు..... డాక్టర్ ఒక
, గురువారం, 9 ఫిబ్రవరి 2012 (13:14 IST)
WD
ఏ చిత్రమైనా కథ, వస్తువు, శిల్పం... కథనం.. అనేవి ముఖ్యమని చెబుతుంటారు. అవి ఎలా ఉంటాయి.. వాటితో మనకేంటి పని... రెండు గంటలు ప్రేక్షకుల్ని నవ్వించామా? లేక మెప్పించామా? అన్నది టార్గెట్‌ చేసే సినిమాలు తీస్తున్న తరుణంలో... కథలోని సాధ్యాసాధ్యాలు, న్యాయనిర్ణయాలు.. అలా చేస్తే కరెక్టా? కాదా?.. అని ఆలోచించే సినిమాలు కొన్నే.

సినిమా అనేది కోట్లమందికి చేరువయ్యేది. దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అటువంటి సినిమాను తీయడానికి ఎన్నిజాగ్రత్తలు తీసుకోవాలి? అనేవి సదరు నిర్మాతల్ని, దర్శకుల్ని తొలిచినా... పెద్దగా పట్టించుకోరు. వాటన్నిటికీ తగిన సమాధానం ఋషి చెబుతుందనడంలో అతిశయోక్తికాదు.

ఋషి (అరవింద్‌ కృష్ణ) మెడికల్‌ స్టూడెంట్‌. మనసులో ఉండేది అనేస్తాడు. కొందరి దృష్టిలో నిజంమాట్లాడేవాడు. కొందరికి బేడ్‌గై.. మరికొందరికి పజిల్‌.. తను చవివేకాలేజీలో పూజ (సుప్రియా శైలజ) సహవిద్యార్థిని. వారితోపాటు మరో ఐదారుగురు విద్యార్థులు. మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం నుంచి పూర్తయ్యేవరకు ఒక్కో ఏడాది ఒక్కో అనుభవం విద్యార్థులకు కలుగుతుంది.

స్టూడెంట్‌ అయినా తన షార్ప్‌నెస్‌తో లైసెన్స్‌ డాక్టర్‌ కాకముందే స్పాంటేనియస్‌గా పురుడుపోస్తాడు. అలాగే ఓ అత్యవసర స్థితిలో ఏడేళ్ళ బాలుడ్ని తనట్రీట్‌మెంట్‌తో కోమాలోంచి బయటకు తెస్తాడు. ఇది సహించని కాలేజీ డీన్‌ బృందం. దీనిపై వివరణ కోరుతుంది. వారం రోజుల్లో రిపోర్ట్‌ తయారుచేసి తను చేసిందని కరెక్టేనని నిరూపిస్తాడు.

కానీ బాలుడు బతకాలంటే.. బి పాజిటివ్‌ ఉన్న గుండెమార్పిడి జరగాలి. దీనికోసం ఎంత వెతికినా దొరకదు.. చివరిగా తన గ్రూప్‌కూడా అదేనని తెలుసుకున్న ఋషి... తను లెదల్‌ ఇంజనక్షన్‌ ద్వారా (రోగి మరణం కోరుకోవడం) చనిపోయి.. తన హార్ట్‌ను ఆ బాలుడికి పెట్టాలని నిర్ణయించుకుంటాడు.. దీనికి అతనిని గాఢంగా ప్రేమించి పెండ్లి చేసుకోవాలనుకున్న పూజ ససేమిరా అంటుంది.

తోటి విద్యార్థులు ఒప్పుకోరు. ఆఖరికి ఈ విషయాన్ని కోర్టువరకు తీసుకెళతాడు. కోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇస్తుంది. అది ఏమిటి? అసలు ఋషి తన గుండెను ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? రోగి, వైద్యుడి మధ్య ఉండాల్సిన సంబంధం ఏమిటి? అన్న విషయాలకు మిగిలిన సినిమా చూడాల్సిందే.

దర్శకుడు రాజ్‌ మాదిరాజ్‌ రాసుకున్న కథ, కథనం విషయంలో ఎక్కడా తడబాటు కన్పించలేదు. చెపాల్పనుకున్నది సూటిగా పొందికగా చెప్పాడు. కాలేజీలోని పాత్రల్లో ప్రేక్షకుడు ట్రావెల్‌ అవయిపోతాడు. కథలో ఉన్న ఆత్మ అలా లాక్కెళుతుంది. కొన్ని సన్నివేశాల్లో ఏడిపిస్తాడు కూడా.

అరవింద్‌కృష్ణ ఇంతకుముందు 'ఇట్స్‌మై లవ్‌స్టోరీ' లవర్‌బాయ్‌గా చేశాడు. ఈ చిత్రంలోని డాక్టర్‌ పాత్రకు పూర్తి న్యాయంచేశాడు. అతని దర్శకుడు ఎంపిక చేసిన విధానం బాగుంది. తను చెప్పే మాటలు.. ఇప్పటి యువత ఆలోచనలకు అద్ధంపడతాయి. మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు తను ఒకేమూడ్‌ను మెయింటేన్‌ చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

పూజ పాత్రలో ముంబైకు చెందిన సుప్రియశైలజ అమరింది. ఇతర విద్యార్థులుగా అంతా బాగా నటించారు. ఎటువంటి కామెడీ ఆర్టిస్టులు లేకుండా వారితోనే కామెడీని పండించడం దర్శకుడు ప్రతిభకు నిదర్శనం. కాలేజీలో జరిగే చిన్న చిన్న సంఘటనల్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. వైద్యవిద్య ముసుగులో రీసెర్చ్‌ డాక్టర్‌ ప్రాక్టీస్‌కు వచ్చే విద్యార్థి పట్ల ఏవిధంగా ప్రవర్తిస్తుంటాడనేది సురేష్‌ పాత్రద్వారా బాగా చూపించాడు.

ఆకర్షణలో ఎమోషన్‌లో వైద్య విద్యార్థులు చేసే విచిత్ర చేష్టల్ని ఎక్కడా తప్పుపట్టలేం. ముఖ్యంగా చిత్రంలో సంబాషణలు ఆకట్టుకున్నాయి. అవి చాలా పదునుగా కూడా ఉన్నాయి. సిగరెట్‌ తాగుతూ ఇది నో స్మోకింగ్‌ జోనా అంటే... హూమన్‌ బాడీనే నో స్మోకింగ్‌ జోన్‌' అనేది. వైట్‌డ్రెస్‌ వేసుకున్న డాక్టర్లు దేవదూతలుగా పేషెంట్‌ అనుకుంటారని... 'రాయికూడా ఏడుస్తుంది..' అంటూ క్లెమాక్స్‌లో ఋషి చెప్పే డైలాగ్‌లు మనస్సుకు తాకుతాయి. పాటలపరంగా కృష్ణచిన్ని చేసిన ప్రయత్నం బాగుంది. కథలో భాగంగా సాగే కొద్దిపాటు సాహిత్యంలో ఎంతో విలువైన విషయాలు తెలియజేశాడు.

30 ఏళ్ళతర్వాత ఎల్‌.వి.ప్రసాద్‌ బ్యానర్‌లో వారి వారసుడు రమేష్‌ ప్రసాద్‌ చేసిన ఈ ప్రయత్నం అభినందించదగింది. లోగడ ఎల్‌వి.ప్రసాద్‌ చిత్రాల్లో సందేశం ఉండేది. దానికి తగినట్లుగా ఈ చిత్రంలోనూ చూపించారు. ఇప్పటి తరం సినిమా అని బ్యానర్‌కు ఆదర్శకంగా చూపించారు నిర్మాత రమేష్‌ప్రసాద్‌.. అవయవ మార్పిడి అనేది ఇందులో చెప్పదలచిన సందేశం.

అది ఎలా చేస్తే బాగుటుంది.. తను ఎందుకు అలా చెప్పదలచుకున్నాడనేది సినిమా చూస్తేనే అర్థమవుతుంది. '3 ఇడియట్స్‌'లాంటి సినిమా అని ఏ కోశానో అనిపించినా..... ఓ ఇంటిలిజెంట్‌ సినిమా తీస్తే ఎలా ఉంటుందనేందుకు ఈ చిత్రం ఉదాహరణ.

కథలు లేవు. తీసేవారు లేరు. ఎప్పుడూ హీరో.. హీరోయిన్లు.. విదేశాల్లో పాటలు, అద్భుతమైన సెట్లు, ఫైట్లు... ఉండాల్సిందేనంటూ... తెగ ఇబ్బంది పడుతూ.... ఒకేమూసలోపోతున్న తెలుగు ఇండస్ట్రీ ప్రముఖుల్ని సైతం నిద్రలేపే సినిమా ఇది. యూనివర్సల్‌ కథతో కూడిన ఈ చిత్రం భారత్‌లోని అన్నిభాషల్లోనూ అనువదించినా ఆశ్చర్యంలేదు. 'మెడిసిన్‌ ఒక తపస్సు... డాక్టర్‌ ఒక ఋషి' అనే కాప్షన్‌కు తగిన సినిమా ఇది.

Share this Story:

Follow Webdunia telugu