"మళ్ళీ మళ్ళీ" ఫేమ్ కళ్యాణి హీరోయిన్‌గా, విక్టరి ఫిలింస్ టి. దుర్గారావు సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "సర్పయాగం".
రాజపుత్ర క్రియేషన్స్ పతాకంపై రుద్రరాజు ప్రసాద్‌రాజు నిర్మించిన ఈ సినిమాకు అన్బు దర్శకత్వం వహించారు. తాజాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న "సర్పయాగం" ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది.
ఆగస్టు నెలాఖరుకు విడుదలకానున్నఈ సినిమా గురించి నిర్మాత రుద్రరాజు ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. తమిళంలో ఘనివిజయం సాధించిన "ప్రతినాయిరు 7 టు 10 ఎ.ఎం" అనే చిత్రాన్ని"సర్పయాగం" పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు.
జల్సాలకు అలవాటుపడిన నలుగురు యువకులు మద్యం మత్తుతో ఓ ఆదివారం అనుకోకుండా తమకు తారసపడిన హీరోయిన్‌ను రేప్ చేస్తారు. తనకు జరిగిన అన్యాయానికి వారిపై పగతీర్చుకునే క్రమంలో, తనను రేప్ చేసిన ఆ నలుగురిలో ఒకరిని కొన్ని విచిత్ర పరిస్థితుల్లో హీరోయిన్ పెళ్ళి చేసుకుని నలుగురిపై పగ తీర్చుకుంటుంది.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ కథని డైరక్టర్ అన్బు చాలా అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందన్న నమ్మకం తనకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చిత్ర సమర్పకుడు టి. దుర్గారావు మాట్లాడుతూ.. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగే కథ, కథనాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలో సర్పయాగం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు నెలాఖరులోపు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దుర్గారావు తెలిపారు.
కళ్యాణి, సురేష్, బాలాజీ, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: ఎం. రాజశేఖర రెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: జాన్‌పీటర్, కెమెరా: సహదేవ్, ఎడిటింగ్: ఎస్.కుమార్.