ఆదిత్య ఓం, దినేష్, సునయన, రూపాకౌర్ నాయకా నాయికలుగా నటిస్తోన్న చిత్రం "తడాఖా". రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై పూసల రాధ దర్శకత్వంలో బి. ఓబుల్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.
ముహూర్తపు షాట్‌కు కోడి రామకృష్ణ క్లాప్ ఇవ్వగా, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పి.సి.రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
రెండు షెడ్యూల్స్‌లో "తడాఖా"ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఓబుల్ రెడ్డి అన్నారు. పూసల రాధ చెప్పిన కథ చాలా బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నానని, "భోజ్‌పురి" సూపర్ స్టార్స్ అయిన దినేష్, సునయనను కథానాయికగా పరిచయం చేస్తున్నామని నిర్మాత తెలిపారు. వీరందరూ కచ్చితంగా తమ "తడాఖా" చూపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ చిత్రం ద్వారా తెలుగులో హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా ఉందని కథానాయకుడు దినేష్ అన్నారు. ఇందులో తాను గుడిలో పూజారిగా నటిస్తున్నానని చెప్పారు. భోజ్‌పురితో పాటు తాను నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయని హీరోయిన్ సునయన వెల్లడించింది. ఇందులో తాను కీలకపాత్ర పోషిస్తున్నానని, ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు మరో కథానాయిక రూపాకౌర్ కృతజ్ఞతలు తెలియజేసింది.
దర్శకుడు పూసల రాధ మాట్లాడుతూ.. భోజ్‌పురి చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా మీకు తెలుగులో సినిమా చేసే ఆలోచన వుంటే నాకు చెప్పండి అన్నాను. సరిగ్గా సంవత్సరం తరువాత తడాఖా కథ విని భోజ్‌పురి తారలు ఇందులో నటిస్తున్నారని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు జీవి, కెమెరా మెన్ మోహన్ చంద్, డ్యాన్స్ మాస్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు.