Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్‌

తిట్టేవాడు ఎప్పుడూ వెనకే వుంటాడు: 'పులి' ఆడియో వేడుకలో విజయ్‌
, సోమవారం, 3 ఆగస్టు 2015 (20:37 IST)
''మనల్ని ఎవరైనా తిట్టినా.. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకంటే వాడెప్పుడూ మనకంటే వెనకే వుంటాడు. సినిమా రంగంలో కొత్తగా వచ్చినప్పుడు 'వీడేం నటుడు' అన్నారు. నా వెనకాలే చాలామంది కామెంట్‌ చేశారు. ఆ వెనకాల వున్నవారే ఎప్పుడూ వెనకాలే వుంటారు. ముందడుగు నాదే వుంటుంది... అలాగే, సినిమాను థియేటర్లో చూడండి.. పైరసీ చూస్తే... మామూలుగా డెలివరీ అవ్వాల్సిన పాపను బలవంతంగా సిజేరియన్‌ చేసి తీస్తే ఎలా వుంటుందో అలా వుంటుంది. దానివల్ల కోట్లు పెట్టి తీసిన నిర్మాతకు చాలా నష్టం.'' అని తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌ అన్నారు. ఆయన హీరోగా, శ్రీదేవి తల్లిగా, శ్రుతి హాసన్‌, హన్సిక కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా 'పులి'. శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్ర ఆడియో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ పుట్టినరోజైన ఆదివారంనాడు చెన్నై శివార్లలోని మహాబలిపురంలోని రిసార్ట్స్‌లో జరిగింది. తమిళ సినీరంగ ప్రముఖులు అభిమానుల మధ్య వైభవంగా జరిగింది. ఆడియో సీడీలను హీరో విజయ్‌  తల్లి శోభ చంద్రశేఖర్‌, సతీమణి సంగీత విజయ్‌ విడుదల చేశారు. మ్యూజిక్‌ సోని మ్యూజిక్‌ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది.   తెలుగులో ఈ సినిమాను ఎస్‌.వి.ఆర్‌.మీడియా బ్యానర్‌పై సి.జె.శోభ విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా అతిథులంతా విజయ్‌ను పొగడ్తలతో ముంచేయగా, టి.ఆర్‌. రాజేందర్‌... విజయ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అసలు నిజమైన పులి, విమర్శించే వారికి పెద్దపులి.. ఎదురులేని పులి.. అంటూ రకరకాలుగా విశ్లేషిస్తూ ఒక్కసారిగా ఆడిటోరియంను అభిమానుల్ని వూపేశారు.
 
అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ... నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మాతృభూమి. మెట్టినిల్లు ముంబై.. అయినా.. ఇక్కడే నాకు సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. పులి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
విజయ్‌ మాట్లాడుతూ ''నాకు చాలా రోజులుగా హిస్టరికల్‌ బేస్‌డ్‌ మూవీలో నటించాలి, అయితే అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏవీ మిస్‌ కాకుండా ఉండాలని కోరిక ఉండేది. ఈ 'పులి' చిత్రంతో ఆ కోరిక తీరపోయింది. పులి కడుపున పులే పుడుతుందనే విధంగా కమల్‌ తనయ శృతిహాసన్‌ ఈ సినిమాలో పెర్‌పామ్‌ చేసింది. అలాగే ముంబాయ్‌ దక్షిణాదికి వచ్చిన నిధి హన్సిక, ఇద్దరూ పోటీపడి నటించారు. అలాగే శ్రీదేవిగారు ఓ కీలకపాత్రలో నటించారు. ఆవిడ దాదాపు 27 సంవత్సరాలు తర్వాత నా సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు.
 
అలాగే కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్‌గారు కథ వినగానే గొప్ప మనసుతో నెగటివ్‌ రోల్‌ ఉండే సినిమాలో నటించారు. దర్శకుడు చింబుదేవన్‌ చేసిన కొత్త ప్రయత్నమే ఈ చిత్రం. కెమెరామెన్‌ నటరాజ్‌ ప్రతి సీన్‌ను అద్భుతంగా తన కెమెరాలో చిత్రీకరించారు. ఇక దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సంగీతాన్ని నేను ఎప్పుడూ వినడానికి ఇష్టపడుతుంటాను. ఆర్ట్‌ డైరెక్టర్‌ అద్భుతమైన, అబ్బురపరిచే సెట్స్‌ వేసి ఎంతగానో సపోర్ట్‌ చేశారు. కణల్‌ కన్నన్‌ గ్రాఫిక్స్‌ అభిమానులకు కన్నుల పండుగే అవుతుంది. మేం పరీక్ష రాశాం. రిజల్ట్‌ను ఆడియెన్స్‌ చేతిలో పెడుతున్నాను'' అన్నారు. 
 
చిత్ర దర్శకుడు చింబుదేవన్‌ మాట్లాడుతూ ''విజయ్‌గారు కథ వినగానే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. తప్పకుండా కలిసి సినిమా చేస్తున్నామని అప్పటి నుండి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకు పోయారు. నిర్మాతలు ఈ సినిమా కోసం డబ్బు ఖర్చు పెట్టడమే కాదు. కో-డైరెక్టర్స్‌లాగా పనిచేశారు. శ్రీదేవిగారు, సుదీప్‌గారు విలక్షణమైన పాత్రలు చేశారు. నటరాజ్‌, ముత్తురాజ్‌ ఆర్ట్‌ వర్క్‌, కనల్‌ కన్నన్‌ గ్రాఫిక్‌ వర్క్‌ సినిమాకి చాలా ప్లస్‌ అవుతుంది. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో సరికొత్త విజయ్‌ను చూస్తారు'' అన్నారు. 
 
దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''శిబు, సెల్వకుమార్‌లు అద్భుతమైన నిర్మాతలు. ప్రతి విషయాన్ని బాగా డిస్కస్‌ చేసి ఎటువంటి మ్యూజిక్‌ కావాలో దాన్ని రాబట్టుకున్నారు. తొలి సాంగ్‌ వినగానే వారు నాకు ఒక గోల్డ్‌ రింగ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ సినిమా కోసం నేను ఒక పాటను రాశాను. ముందు నేను రాయకూడదు అనుకున్నాను కానీ విజయ్‌గారు ఫోన్‌ చేసి నువ్వు పాట రాయాల్సిందే అనడంతో, నేను చేసిన ప్రయత్నమిది. సంగీతం, సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది'' అన్నారు. 
 
ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ''నా తనయుడు విజయ్‌ ఈ స్థాయికి ఎదగడానికి కారణం ఆయనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలే కారణం'' అన్నారు. టి.రాజేంద్రన్‌ మాట్లాడుతూ ''నేను, చంద్రశేఖర్‌ మంచి స్నేహితులం. తనని ఎప్పుడు కలిసినా విజయ్‌ గురించే మాట్లాడుతుంటాను. తను పుట్టినప్పుడు తను పుట్టిన నక్షత్రం బావుందని చెప్పేవాడిని కానీ, తనే ఒక నక్షత్రంలా ఎదిగాడు. తనను అభిమానించేవారికి, సపోర్ట్‌ చేసే వారికి విజయ్‌ ఎప్పుడూ అండగా నిలబడతాడు. ఇంత పెద్ద అభిమానగణం ఉన్న విజయ్‌ పులి సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.
 
ఎస్‌.వి.ఆర్‌.మీడియా సి.జె.శోభ మాట్లాడుతూ ''ఈ సినిమాని తెలుగులో నేనే రిలీజ్‌ చేస్తున్నాను. మా సంస్థను నమ్మి విజయ్‌గారు ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించారు. గతంలో ఆయన సూపర్‌హిట్‌  చిత్రం తుపాకీ తెలుగులో మేమే రిలీజ్‌ చేశాం. ఇప్పుడు ఈ సినిమాని కూడా దాదాపు వెయ్యికి పైగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. 
 
హన్సిక మాట్లాడుతూ ''విజయ్‌గారితో నేను చేస్తున్న రెండో మూవీ. మంచి హార్డ్‌వర్క్‌, ప్రొఫెషనలిజమ్‌ ఉన్న హీరో. అలాగే శ్రీదేవిగారు, శృతితో వర్క్‌ చేయడం చెప్పలేని అనుభూతినిస్తుంది. చింబుదేవన్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇంత పెద్ద మూవీలో నటించే అవకాశం కల్పించి దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు. 
 
శృతిహాసన్‌ మాట్లాడుతూ ''పులి వంటి భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌. ఈ సినిమాలో విజయ్‌గారితో కలిసి నటించడమే కాదు, పాడటం కూడా కష్టమని ఈ సినిమాతో తెలిసింది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu