Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మశ్రీ వివాదం: మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట..

పద్మశ్రీ వివాదం: మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట..
, సోమవారం, 3 ఆగస్టు 2015 (14:27 IST)
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ‘పద్మశ్రీ' అవార్డును దుర్వినియోగం చేసారనే కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మోహన్ బాబు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2007లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో ఒక కేసు పెట్టారు. అందులో.. మోహన్ బాబు తన లెటర్ పాడ్‌లలో, ఉత్తర ప్రత్తురాలలో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు.
 
ఆయన నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో కూడా మోహన్ బాబు పేరు ముందు పద్మశ్రీ అని వేశారు. పేరుకు ముందు లేదా తర్వాత పద్మశ్రీ బిరుదును ప్రస్తావించి ఇతర ప్రయోజనాలకు వాడుకోరాదని గతంలో సుప్రింకోర్టు తీర్పు ఇచ్చిందని, కాని మోహన్ బాబు అందుకు విరుద్దంగా చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీ బిరుదును వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా, తన ప్రమేయం లేకుండానే 'దేనికైనా రెడీ' చిత్ర నిర్మాత తన పేరు ముందు పద్మశ్రీని వాడుకున్నారని తెలుపుతూ మోహన్ బాబు ఇచ్చిన వివరణను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును మోహన్ బాబు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. గత ఏప్రిల్ నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. 
 
ఈ విచారణలో ఇక ముందు ఎప్పుడూ పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనని, సినిమా టైటిల్స్‌లో తన పేరుకు ముందు పెట్టుకున్న పద్మశ్రీని తొలగిస్తానని ఆయన అఫిడవిట్ చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టైంది.

Share this Story:

Follow Webdunia telugu