టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరిపై రోజుకో రకమైన ఊహాగాన వార్తలు వస్తున్నాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తన అందంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. అదేసమయంలో ఆమెపై పుకార్లు మాత్రం కోకొల్లులుగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యువ హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. పైగా, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చేలా ఇటీవల మీనాక్షి చౌదరి, సుశాంత్ ఇద్దరూ విమానాశ్రయంలో కనిపించి, కెమెరా కంటికి చిక్కారు. బహిరంగ ప్రదేశంలో ఈ జంట కనిపించడంతో ఈ రూమర్స్‌కు మరింత పదును పెట్టింది. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని అభిమానులు, నెటిజన్లు గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. అదేసమయంలో సోషల్ మీడియాలో వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో మీనాక్షి చౌదరి టీమ్ స్పందించింది. వారిద్దరి రిలేషన్‌పై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. మీనాక్షి చౌదరి, సుశాంత్‌లు కేవలం స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశారు. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, మీనాక్షి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే తామే స్వయంగా అధికారంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
కాగా, వీరిద్దరూ కలిసి గత 2021లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంలో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కడ కలిసి కనిపించినా పలు రకాల రూమర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ ప్రకటనలతో ఈ ప్రచారానికి తెరపడినట్టే.