Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళ లెజెండ్రీ నటి మనోరమ ఇకలేరు... చెన్నైలో మృతి

తమిళ లెజెండ్రీ నటి మనోరమ ఇకలేరు... చెన్నైలో మృతి
, ఆదివారం, 11 అక్టోబరు 2015 (07:33 IST)
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ సినీ నటి మనోరమ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 78 యేళ్లు. మూడుతరాల ప్రజలను తనదైన నటన, హాస్యంతో నటి మనోరమ ఆకట్టుకున్నారు. 
 
దక్షిణాదిన ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటిగా ఆమె మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2002లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సుమారు వెయ్యి చిత్రాలకు పైగా నటించిన నటిగా ఆమె గుర్తింపు పొందారు. తమిళంతో పాటు.. తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో ఆమె నటించారు. ఆమెకు తమిళ ఆచ్చి అనే ముద్దుపేరు కూడా ఉంది. 
 
మనోరమ అసలు పేరు గోపీశాంత. 1937 మే 26 తమిళనాడులోని మన్నార్‌గుడిలో ఆమె జన్మించారు. ఈమె మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్‌టీఆర్, మహానటులు శివాజీగణేశన్, నాగేష్, సత్యరాజ్, ఏయన్నార్‌లతో పాటు.. కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్, నేటితరం నటీనటులతో కూడా ఇప్పటి వరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. 1963లో విడుదలైన కొంజుం కుమరి అనే చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కన్నతిరందు చిత్రంలో హీరోగా నటించిన ఎస్ ఎం రామనాథన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి భూపతి అనే కుమారుడు ఉన్నాడు. 
 
గతేడాది శ్రీకాళహస్తికి వెళ్లిన సమయంలో స్నానాల గదిలో జారిపడి ఆమె తలకు గాయమైంది. అంతేగాక మోకాళ్లకు శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావడంతో ఆమె గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. మనోరమ సుమారు 1500 సినిమాలు మరియు 1000 నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించినది. 1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా గిన్నీస్ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 
 
తెలుగులో భద్రకాళి, శుభోదయం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు, అల్లరి ప్రియుడు, కుంతీ పుత్రుడు, రిక్షావోడు, బావ నచ్చాడు, కృష్ణార్జున, అరుంధతి వంటి చిత్రాలలో నటించారు. ఆమె చివరిగా సింగం సినిమాలో కనిపించారు. ఆమె మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ఓ గొప్పనటిని కోల్పోయిందని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu