Bobby, Vikrant, Chandini Chowdhury, Sandeep Raj, Sailesh Kolanu and others
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్స్ బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ - ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ అందరికీ నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ఆరేళ్లు వెయిట్ చేశారు డైరెక్టర్ సంజీవ్. ఓపిక అనేది చాలా గొప్ప విషయం. మీకు తప్పకుండా సక్సెస్ దక్కుతుంది. అలాగే ఇలాంటి మంచి మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి విజయం దక్కాలి. హీరో విక్రాంత్ ఇందాక బాగా మాట్లాడాడు. మనం కష్టపడి ప్రయత్నిస్తే తలెత్తుకునే రోజు వస్తుందని అన్నాడు. చాందినీ డెడికేషన్ ఉన్న హీరోయిన్. గాయంతో కాలు నొప్పి ఉన్నా, మా డాకూ మహారాజ్ మూవీలో పరుగెత్తే సీన్స్ చేసింది. తను కొత్తదనం ఉన్న మూవీస్ చేస్తూ వస్తోంది అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - మన సొసైటీలో ఇప్పుడు సంతాన లేమి అనే సమస్య ఎక్కువగా ఉంది. మనం దారిలో వెళ్తుంటే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తాయి. అవి ఉండొద్దని కాదు. సంతాన సమస్యలు ఉన్నవారు చికిత్స తీసుకోవచ్చు. కానీ అన్నీ బాగుండి లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో అడ్రస్ చేశాం. మీరు ట్రైలర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఉన్నాయి, వాటితో పాటు చిన్న మెసేజ్ కూడా ఉంది. ఇదే మా సినిమా. ఫెర్టిలిటీ ఇష్యూను అలాగే తెరకెక్కిస్తే భయపడతారు అందుకే ఆ కథ చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసి రూపొందించాం. ఈ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న నటీనటులంతా ఉన్నారు. మంచి బడ్జెట్ ఇచ్చి ఈ సినిమాను చేసే అవకాశం కల్పించారు అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - ఈ చిత్రంతో ఒక మంచి ప్రయత్నం చేశాం. వికీ డోనర్ అనే సినిమా ఎన్నో ప్రొడక్షన్ ఆఫీస్ లకు వెళ్లి రిజెక్ట్ అయ్యాక గానీ మూవీగా రాలేదు. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానాలా మన తెలుగులో విక్రాంత్ పేరు తెచ్చుకుంటాడు. మా హీరోయిన్ చాందినీ ఆకట్టుకునేలా నటించింది. డైరెక్టర్ సంజీవ్ తో పాటు మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమాకు తెలుగు హీరోయిన్ ను తీసుకోవాలి, తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని చాందినీని ఎంచుకున్నాం. ఆమె కల్యాణి పాత్రలో ఆకట్టుకునేలా నటించింది. విక్రాంత్ ఈ చిత్రంలో చైతన్య క్యారెక్టర్ కు యాప్ట్ గా అనిపించాడు. కొన్నిసార్లు ఆయనను చైతన్య అని పిలిచేవాళ్లం. శ్రీధర్, విక్రాంత్, నేనూ ఐటీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం. ఈ సినిమాకు మేము చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాం. అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ - ఫస్ట్ టైమ్ మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించింది. ఈ సమస్య గురించి మాట్లాడేందుకు అందరూ ఇబ్బంది పడతారు. మిగతా వాళ్లు చులకనగా చూస్తారా, నవ్వుతారా అని సందేహిస్తారు. అలాంటి సీరియస్ పాయింట్ చుట్టూ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ చేర్చి ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా అందరూ మాట్లాడుకునేలా ఒక ప్రయత్నం చేశాం. అన్నారు.